” చేపల్ని పట్టుకోవాలంటే గాలం వేయాలి.. ఓటర్లను బుట్టులో వేసుకోవాలంటే స్కీములు చల్లాలి ” ఇది నేటి రాజకీయ నాయకుల నీతి. ఓటర్లు చేపలు లాంటి వారే. తమకు వేసేది ఎర అని తెలిసినా తెలియనట్లుగానే ఉంటారు. తమకు ఏదో ఇస్తున్నారు కదా అని ఆశపడతారు. చివరికి ఎరకి చిక్కి విలవిల్లాడుతారు. వర్షాలు వచ్చినప్పుడు.. చేపల కోసం ఎరలతో వేటగాళ్లు ఎలా రెడీ అవుతారో.. ఎన్నికల సీజన్లో రాజకీయ నేతలూ అదే పని చేస్తారు . ఇప్పుడు దేశంలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. రాష్ట్రాల ఎన్నికలు.. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో వచ్చే జూన్ వరకూ సందడి సందడిగా ఉండనుంది. కానీ అసలు మ్యాజిక్ మాత్రం ఇప్పుడే ప్రారంభమయింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరగనున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగుతాయి. ఏపీలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో లేదో కానీ.. మార్చిలో మాత్రం ఎన్నికలు ఖాయం. ఇక దేశం సంగతి చెప్పాల్సిన పని లేదు. అయితే దేశంలో కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికల వేడి 40 డిగ్రీలు దాటిపోయింది. ఎన్నికల ఫీవర్‌తో ప్రతి ఒక్క రాజకీయనాయుడు వేడెక్కిపోతున్నాడు. అధికారం నిలబెట్టుకోవాలనుకునే వాళ్ల తాపత్రయం ఒకరి.. అధికారం అందుకోవాలనుకునేవారి తాపత్రయం మరొకరది. ఎలా చూసినా… అందరూ ఓటర్లను పట్టుకోవడానికి హామీలనే వరదలతో రంగంలోకి దిగిపోయారు. ఎవరికి వారు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు ప్రారంభించారు.
నాలుగున్నరేళ్లు అమలు చేయలేని హామీలు రెండు నెలల్లో కేసీఆర్ చేసేస్తారా ?
నాలుగున్నరేళ్లుగా చేయని రుణమాఫీకి కేసీఆర్ ఇప్పటికిప్పుడే చేయాలనుకుంటున్నారు. అందు కోసం అక్షరాలా ఇరవై వేల కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నారు. పేరుకు రుణమాఫీ కానీ ఇది నగదు బదిలీ పథకం లాంటిదే. లక్ష రూపాయల్లోపు రుణాలను మాఫీ చేస్తామని కేసఆర్ హామీ ఇచ్చారు. కానీ చేయలేదు. మధ్యలో దళిత బంధు అని.. బీసీ బంధు అని పథకాలు ప్రారంభించారు కానీ.. రైతుల గురించి మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి కాబట్టి.. రైతుల ఆగ్రహాన్ని చూడకుండా ఉండాలంటే రుణమాఫీ చేయాల్సిందేనని తీర్మానించుకున్నారు. రాత్రికి రాత్రి నిర్ణయం ప్రకటించి.. ప్రకటించిన తర్వాతి రోజే అమలు ప్రారంభించారు. రుణమాఫీ ప్రారంభమైనందన్నదానికి సూచికగా తొలి రోజు దాదాపుగా రూ. 167 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా చెప్పారు. అయితే రూ. 19 వేల కోట్లెక్కడ.. 167 కోట్లెక్కడ అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రుణమాఫీ ప్రారంభమయిందని చెప్పడానికే.. ! తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ ఒక్క రుణమాఫీతో ఆగిపోరు. నిజానికి కేసీఆర్ ప్రకటిస్తున్న పోల్ బోనాంజాల్లో ఇది మొదటిది కాదు..చివరిది కాదు. కేసీఆర్ గత ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను ఇప్పటికే ప్రారంభించారు. దళిత బంధు పేరుతో రూ. పది లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధుల పేరుతో ఒక్కో లక్ష ఇస్తున్నారు. ఇవేమీ .. మేనిఫెస్టోలో లేవు. కానీ ఓట్ల పంట పండించడానికి అవసరం. ఆర్టీసీని విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి ఇదే కేసీఆర్ 2019లో ఈ భూగోళం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారు. కానీ ఆయనే .. ఆర్టీసీ విలీనం నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకు ? ఇంకెందుకు..ఎన్నికలు ముందుగా ఉన్నాయి.. ఓట్లు పొందడానికి. కేసీఆర్‌కు ఓటర్ల మైండ్ సెట్ బాగా తెలుసు. అందుకే ఆయన వరుసగా పోల్ వరాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. అమలు చేస్తారా లేదా అన్నదానిపై తర్వాత చర్చించుకుందాం.. కానీ ఇప్పటికైతే … ఆయన వరాలు ప్రకటిస్తున్నారు.
వాలంటీర్లకు రూ. పది వేల జీతం, రూ. 4వేల పెన్షన్ గా గాలాలతో జగన్ రెడ్డి కూడా రెడీ!
కేసీఆర్ చేసే రాజకీయాలపై.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓ సారి అసెంబ్లీలో ఓ కథ చెప్పారు. ” ఓ రాజును.. విదూషకుడు మంచి మంచి జోకులు చెప్పి నవ్వించాడట. దీనికి మెచ్చిన రాజు.. నీకు ఓ లక్ష వరహాలు బహుమతిగా ఇస్తున్నాను పో” అని ప్రకటించేశారు. ఎంత కాలం ఎదురు చూసినా ఆ బహుమతి తనకు అందలేదు. దాంతో ఆ విదూషకుడు రాజుగ గారి సభకు వెళ్లి మొరపెట్టుకున్నాడట.. అప్పుడు ఆ రాజుగారు..నువ్వు నాకు జోకులు చెప్పి ఆనందించేలా చేశావు..నేను కూడా నీకు లక్ష వరహాలు ఇస్తానని చెప్పి ఆనందించేలా చేశాను అంతే .. నిజంగా ఇస్తానని అర్థం కాదు అన్నారట ” . రాజుగారి మాట విని విదూషకుడిగా ఏడుపొక్కటే తక్కువ. ఇది కేసీఆర్ ను ఉద్దేశించి అసెంబ్లీలో చెప్పినప్పటికీ.. మన రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది. కేసీఆర్ అధికార పార్టీని నడుపుతున్నారు.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తాను అని చెప్పడం కాకుండా చేసి చూపించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే అమలు ప్రారంభిస్తున్నాం అని చెబుతున్నారు. ఎప్పుడు అమలు చేయడం పూర్తవుతుందో మాత్రం ఎవరూ చెప్పలేరు.. అధికార పార్టీ నాయకులకు ఉండే అడ్వాంటేజ్…మాత్రమే కాదు మైనస్ కూడా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే ఇలాంటి వాటిపై మీడియాకు లీకులు ఇవ్వడం ప్రారంభించారు. ఆయన స్టైల్ ఆఫ్ ఎరలు వేరుగా ఉంటాయి. ఉద్యోగులందర్నీ రాచి రంపాన పెట్టిన ఆయన వారికి ప్రత్యామ్నాయంగా యాభై ఇళ్లకు ఒకర్నిచొప్పున పెట్టుకున్న వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్లే గెలిపిస్తారని ఆశలు పెట్టుకున్న ఆయన.. వారి జీతం పది వేలు చేస్తానన్న సంకేతాలు పంపుతున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి చేసి చూపించాలి.. అందుకే ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు చేసి చూపిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు రెండు వేల రూపాయలు చేసిన వృద్ధాప్య పెన్షన్లను రూ. మూడు వేలు పెంచుకుంటూపోతానని ఐదో ఏడు సగం పూర్తయినా రూ. 2750 దగ్గరే ఉన్న జగన్ రెడ్డి.. పరిస్తితి క్లిష్టంగా మారడంతో… చివరి ఒకటి, రెండు నెలలు అయినా కనీసం నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్లను నాలుగువేలకు పెంచుతానని ఆయన సంకేతాలిస్తున్నారు. ఇక రైతులకు ఏమిస్తారు.. బీసీలకు ఏమిస్తారు.. మైనార్టీలకు ఏమిస్తారు అన్నది తేలాల్సి ఉంది. అయితే వరాల సునామీ మాత్రం ఆగదని చెప్పాల్సిన పని లేదు.
అంతకు మించి చేస్తామని గ్యారంటీ హామీలు ప్రకటిస్తున్న విపక్షాలు !
అధికార పార్టీలకు ఉండే అడ్వాంటేజ్ తాము ప్రకటించడమే కాదు.. పంచడం చేసే అవకాశం ఉండటం. ఎక్కువ సార్లు ఇదే మైనస్ కూడా అవుతుంది. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు పంచుతావా అనేభావన ప్రజల్లోకి వచ్ిచందంటే.. మొదటికే మోసం వస్తుంది. పైగా ఎవరి డబ్బులు ఇస్తున్నావు గురూ అని డబ్బులు తీసుకునేవాళ్లు ప్రశ్నించే అవకాశం కూడా పెరుగుతోంది. అయితే విపక్ష పార్టీలకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే.. అలవి కానీ హామీలిచ్చుకునే వెసులుబాటు ఉండటం. కసీఆర్ పరుగును అందుకోవాలంటే కాంగ్రెస్ అంతకు మించిన తాయిలాలు ప్రకటించారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్ ప్రకటించారు. మహిళా డిక్లరేషన్లు కూడా ఉంటాయి. రైతుకు రెండు లక్షల రుణమాఫీ దగ్గర్నుంచి లెక్కలేన్నని పథకాలు ఉన్నాయి. యువకకూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అనే ఆకర్షీయమైన ఎర కూడా ఉంటుంది. ఇక ఏపీలోని ప్రతిపక్షాలు తక్కువేమీ తినలేదు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా జగన్ రెడ్డి పంచేదాని కన్నారెట్టింపు పంచుతామని బయలుదేరారు. టీడీపీ అధినేత.. భవిష్యత్ గ్యారంటీపేరుతో ఆరు హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇదే ఫైనల్ కాదు.. అసలు హామీల చిట్టా దసరాకు ప్రకటిస్తామని అంటున్నారు. జగన్ రెడ్డిలా అప్పులు చేసి . .ఆస్తులు తాకట్టు పెట్టి కాదని.. తాము సంపద సృష్టిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ తక్కువేమీ లేదు. సీపీఎస్ రద్దు దగ్గర్నుంచి … ఉచిత హామీల వరద పారిస్తున్నారు. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన పార్టీ ప్రచారం చేస్తోది. తాము అధికారంలో వస్తే అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని జనసేన ప్రకటించింది. అప్పులేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు షణ్ముక వ్యూహం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కాస్త ఆలోచిస్తే.. సాధ్యమేనా అంటే.. ఆలోచించాల్సిందే. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ను రద్దు చేస్తామని.. ఉద్యోగ వేతరణ సవరణ పీఆర్సీ అమలు చేస్తామని .. ఆంధ్రప్రదేశ్‌ను అభ్యుదయ రాజధానిగా మార్చుతామని చెబుతోంది. రాయలసీమలో ఉపాధి అవకాశాలు , తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇసుక , యువత పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు రూ.10 లక్షల ఆర్థికసాయం, లాభసాటిగా వ్యవసాయం, పంట కాల్వల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం ప్రైవేట్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఇలా అలవి మాలిన హామీలు ఇస్తోంది. నిజంగా ఇవన్నీ చేయగలరా అంటే.. కాస్త బుర్ర ఉన్న ఎవరైనా ఎలా సాధ్యమని అనుకోక తప్పదు. కానీ రాజకీయాలంటే ఇదే.. ఓటర్లను బుట్టలో వేసుకోవాలంటే.. ఎరలు రెడీ చేసుకోవాలి. ఈ స్కీములన్నీ ఎరల్లాంటివే.
ఓటర్ల ఆశను ఓట్లుగా మల్చుకోవడమే రాజకీయ పార్టీల వ్యూహం !
కడుపు నింపి ఓటింగ్‌కు తీసుకెళ్లడం అనేది విఫల రాజకీయ వ్యూహం అని రాజకీయ నేతలందరికీ తెలుసు. ఇదిగో ఓటేసి రా ఈ ప్రయోజనం కల్పిస్తానని మభ్య పెట్టి ఓట్లు వేయించుకోవడమే అసలైన రాజకీయం. ఇదిగో నీకిది ఇచ్చా.. నాకే ఓటేసి రా అంటే ఓటర్ కూడా.. ఇచ్చేశావు కదా ఇంకెందుకు.. ఓటేస్తే ఇంకెవరో.. వేరేది ఇస్తామంటున్నారు అని ఆశపడే మనస్థత్వం. అందుకే రాజకీయాలు ఉచితాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాల్లో నేతలు పండిపోయారు. పథకాల ఆశ చూపించి ఓట్లు పొందడం.. ఆనక.. మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ వారితో వెయిట్ చేయించడం.. మళ్లీ అలాంటి హామీల్ని ఎరగా వేసి ఓట్లు పొందడం ఓ ప్రాక్టీస్ గా మారిపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా స్కీములు పూర్తిగా అమలు చేయదు.. ఉదాహరణకు ఏపీ సీఎం జగన్ రెడ్డినే తీసుకుంటే.. ఆయన అమలు చేస్తున్న పథకాలు తీరు చూస్తే ఇంత మోసం చేస్తారా అని కడుపు రగిలిపోతుంది. కానీ నిజం తెలిసిన వారికే .. పార్టీలు, పథకాల మత్తులో ఉన్న వారికి కాదు. రైతు భరోసా కింద ఆయన ఒకే విడతలో పన్నెండున్నరవేలు ఇస్తామన్నారు. కానీ ఇస్తోంది ఏడున్నర వేరు. అదీకూడా మూడు విడతల్లో . ఇక పెన్షన్లు మూడు వేలు చేస్తమని నమ్మించి..ఎన్నికల ముందువరకూ ఆ మొన్ని మూడు వేల వరకూ చేర్చలేదు. ఇక అన్ని వర్గాలకూ ఇచ్చిన హామీల్లో వంద, రెండు వందల మంది లబ్దిదారులు ఉంటే గొప్పగా మారిపోయింది. ఇటీవల విదేశీ విద్యా దీవెన పథకాన్నే తసుకుంటే.. లబ్దిదారులు ముఫ్పై మంది కూడా లేరు. ఇలాంటి పథకాలను ఎరవేసి.. అమలు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీలే కాదు.. రాబోయే పార్టీలు కూడా అదే చేస్తాయి. పథకాలు అందకుండా అర్హతలు అనే అందమైన అడ్డంకి పెడతాయి. పెళ్లికి.. పదో తరగతికి లింక్ పెట్టిన జగన్ రెడ్డి నిర్వాకమే దీనికి సాక్ష్యం. రాజకీయ నేతలు అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు పొందుతారని తర్వాత ఏమీ చేయరన్న ఓ అభిప్రాయం ఇలాంటి స్ట్రాటజీల వల్లే ప్రజల్లో బలపడుతోంది. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పథకాలు అన్నీ అందరికీ చేరవు. కానీ దరఖాస్తులు మాత్రం అందరూ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రభుత్వం దగ్గర మీ దరఖాస్తు ఉంది .. మళ్లీ ఈ ప్రభుత్వం వస్తేనే మీకు నిధులు వస్తాయి అన్న ఓ అభిప్రాయాన్ని పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల ఆశలతో ఆడుకుని అధికార అందలం అందుకోవాలని ప్రయత్నించడమే రాజకీయం.
అసలు ఇక్కడ విషయం ఏమిటంటే.. రాజకీయ పార్టీల ఎరలకు చిక్కుతున్న ఓటర్లకు నిజం తెలుసు. రాజకీయ నేతలు తమకు ఏమీ చేయరని వారికి తెలుసు. తమ డబ్బులే ఇస్తారని తెలుసు. తమ తలను తాకట్టు పెట్టి.. రూపాయి పంచి 90 రూపాయలు నొక్కేస్తారని తెలుసు. ఆ సొమ్మును పన్నుల రూపంలో మళ్లీ తామే కట్టాలని కూడా తెలుసు. కానీ.. రాజకీయ ఎరలకు ప్రజలు చిక్కిపోతూనే ఉన్నారు. ముందు ప్రజలు నిజం తెలుసుకుంటే.. రాజకీయ నేతలు.. ఓటర్లను పథకాల పేరుతో మోసం చేయడానికి వెనుకాడతారు. లేదంటే… ఓటర్లు ఎరలకు చిక్కిన చేపలుగానే మిగిలిపోతారు. చాయిస్ ఓటర్ల చేతిలోనే ఉంది.