సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో అని తెలిసిన దగ్గర్నుంచి అందరి నోటా… ఒకటే చర్చ.. కృష్ణ మెమోరియల్ ఎక్కడ ఏర్పాటు చేస్తారని? సాధారణంగా సినీ తారలు చనిపోయినప్పుడు వాళ్ల అంతిమ సంస్కారాలన్ని ప్రైవేటు ఫామ్ హౌస్‌లలో నిర్వహిస్తుంటారు. ఎందుకంటే… ఆ సమాధి చుట్టుపక్కల ప్రాంతం ఓ జ్ఞాపకంగా మిగిలిపోవాలని. కానీ.. కృష్ణ అంత్య క్రియలు మాత్రం మహాప్రస్థానంలో జరిగిపోయాయి. దాంతో.. కృష్ణ స్మారక చిహ్నం ఉంటుందా, లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే వీటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటి ప్రణాళికలపై.. కృష్ణ కుటుంబం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు టాక్. హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్‌లో.. కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌లు కూడా… తమ వంతు సాయం చేస్తామని మాట ఇచ్చారట. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ప్రస్తావించడం విశేషం. కృష్ణను ఏపీ, తెలంగాణ అంటూ వేరు చేయలేం. తెలుగువారి అభిమాన పాత్రుడు కృష్ణ. అందుకే రెండు ప్రభుత్వాలూ సరైన రీతిలో గౌరవించాలని భావిస్తున్నాయి. తెలంగాణలో కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు కొంత భూమి ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ వరకూ వస్తే.. కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలో ప్రభుత్వం స్థలం కేటాయించే అవకాశం ఉంది. రెండు చోట్లా.. సూపర్ స్టార్ కు గుర్తుగా స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెండు చోట్లా.. కృష్ణ కాంస్య విగ్రహాల్ని, లేదా మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆలోచిస్తున్నామని ఆదిశేషగిరిరావు తెలిపారు. అంతేకాదు.. ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా సేవా కార్యక్రమాలు జరపాలని, అందుకోసం ఓ నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.