తెలుగు రాష్ట్రాల మధ్య పెరిగిపోతున్న జల వివాదాలను పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహిచాలని నిర్ణయించారు. ఐదో తేదీన జరగనున్న ఈ సమావేశంలో.. కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ పాల్గొంటున్నారు. ఇటీవల రెండు రాష్ట్రాలు.. ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి.. పూర్తిగా నీరు చేరకుండానే.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా… తెలంగాణ నీరు వాడుకుంటోందని… ఏపీ ఫిర్యాదు చేసింది. అలాగే కృష్ణాబోర్డు అనుమతి లేకుండా.. ఏపీ సర్కార్.. రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్లు పిలుస్తోందని.. వాటిని అడ్డుకోవాలని తెలంగాణ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో.. పరిస్థితి మరింతగా దిగజారక ముందే.. కేంద్రం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్షంగా… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లి… అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనే అవకాశాలు లేవు. అందుకే సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే..కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నుంచి పూర్తి సమాచారం సేకరించింది. సమావేశ అజెండా కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే.. ముందుగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, తరువాత కార్యదర్శులు, అనంతరం ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ మంత్రులతో సమావేశాలు నిర్వహిరచుకోవాల్సి ఉంటుంది. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడిన అపెక్స్ కౌన్సిల్ రంగంలోకి దిగుతుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రాకుండా.. వచ్చినా పరిష్కరించుకునే దిశగా..కలిసి చర్చించుకునేలా..అపెక్స్ కౌన్సిల్‌ను ప్రతిపాదించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ అపెక్స్ కౌన్సిల్లో ఉంటారు. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క సమావేశం మాత్రమే జరిగింది. 2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన సమావేశానికి చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. రెండో సమావేశం జరగలేదు. స్నేహంతో తామే వివాదాలు పరిష్కరించుకుంటామని.. ట్రైబ్యునళ్లు.. అక్కర్లేదని.. గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులూ కేంద్రం పంచాయతీకి వెళ్తున్నారు.