నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా నీటిని విడుదల చేసుకున్న అంశంపై కేసీఆర్, కేటీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. పోలింగ్ ముగిసే వరకూ ఎవరూ సాగర్ అంశంపై మాట్లాడవద్దని ఈసీ ఆదేశించింది. అందుకే పోలింగ్ అయిన తర్వాత మాట్లాడతారనుకున్నారు. కానీ పోలింగ్ అయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్.. పోలింగ్ సరళి అంశాలపై చర్చలు జరుపుతున్నారు కానీ.. సాగర్ నుంచి నీరు విడుదల పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సెంటిమెంట్ రాజేసేందుకే.. బీఆర్ఎస్, వైసీపీ ఇలాంటి కుట్రలు చేశాయని ఏపీ ప్రభుత్వంపై మరకపడినా పర్వాలేదన్నట్లుగా వ్యవహిరంచారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అంబటి రాంబాబు మాత్రం స్పందించారు.
మా నీటి వాటానే మేం తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. తీసుకునే పద్దతి అదేనా అంటే.. చంద్రబాబు వల్ల.. గేట్ల దగ్గరకు కూడా ఏపీ వాళ్లను పోనియడం లేదని వింత వాదన చేశారు. మరో వైపు ఏపీ పోలీసులు కేసుల్లో ఇరుక్కున్నారు. డ్యాంపై దురాక్రమణ చేశారని.. సీసీ కెమెరాలు పగులగొట్టారని నాగార్జున సాగర్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరో వైపు ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేక రాసింది. బలవంతంగా నీటిని విడుదల చేసుకోవడం ఆపాలని స్పష్టం చేసింది. నీరు కావాలని అడగకుండా ఇలా బలవంతంగా గేట్లు ఎత్తుకోవడం ఏమిటని ప్రశ్నించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అక్టోబర్ నెలలో కేటాయించాలని అడిగిన 5 టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేశామని.. నవంబర్ 30వ తేదీ నుంచి ఇప్పటి వరకూ నీరు కావాలని ఎలాంటి లేఖ పంపలేదని కేఆర్ఎంబీ గుర్తు చేసింది.
సాగర్ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగానే రేపారని అందరికీ అర్థమవుతోంది. అయితే… ఈ రాజకీయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ తప్పు చేసినట్లుగా రికార్డుల్లోకి ఎక్కడంతో భవిష్యత్ లో అనేక సమస్యలు వస్తాయని భావిస్తున్నారు.