కేసీఆర్ చాలా రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే దీన్ని అధికారికంగా కాకుండా ఎవరో పార్టీ కార్యకర్త దూరంగా ఉండి రికార్డు చేసిందని అనిపించేలా చేసి వీడియోలు రిలీజ్ చేశారు. అందులో త్వరలో తాను ఫీల్డ్ లోకి వస్తానని చెప్పినట్లుగా ఉంది. భూపాలపల్లి జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని అన్నారు.
కేసీఆర్ ఫీల్డ్ లోకి ఇలా వస్తానని చెప్పడం వెనకున్న ఆసక్తికర పరిణామాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి రాను రాను దూకుడు పెంచుతున్నారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి అరెస్టులు ఎన్నికలకు ముందు జరిగితే పర్వాలేదు కానీ ఇలాంటి సమయంలో జరిగితే క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అదే సమయంలో రేవంత్ దూకుడుకు తగ్గట్లుగా వ్యవహిరంచడంలో కేటీఆర్ అంత సక్సెస్ కావడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే కేసీఆర్ తాను రంగంలోకి వస్తానని సంకేతాలను పంపుతున్నారని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనతో పోటీ పడక. బీఆర్ఎస్ నష్టపోయిందని ఇక ముందు అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న భావనలో కేసీఆర్ ఉన్నారని.. ఆయన సడెన్ సర్ ప్రైడ్‌గా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పుడు జరిగినా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ కన్నా హరీష్ రావు ఎక్కువ బాధ్యత తీసుకున్నారు.
కేటీఆర్‌కు చాన్సిచ్చేందుకు కేసీఆర్ ఇంత కాలం ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారని ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసిందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చేశాయి. ఆయన సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారిని పరామర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.