ఫిబ్రవరిలో తెలంగాణలో రాజకీయ బహిరంగసభల యుద్ధం జరగనుంది. మొదట మోదీ.. ఆ తర్వాత కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్‌లో నాలుగు రోజుల వ్యవధిలో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ప్రదానమంత్రి మోదీ ఫిబ్రవరి 13వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నెలలోనే రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో రైల్వే.. ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
మోదీ సభ ముగిసిన నాలుగు రోజులకు అంటే.. ఫిబ్రవరి 17వ తేదీన అదే పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగసభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. అదీ కూడా మోడీ సభను తలదన్నేలా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఏ సభ పెట్టిన జాతీయ స్థాయిలో ఉండాలని అనుకుటున్నారు. అందుకే పరేడ్ గ్రౌండ్స్ సభకు జాతీయ నేతల్ని ఆహ్వానిస్తున్నారు..
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన అదే రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఆ సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఇలా అందర్నీ పిలుస్తున్నారు. వారు అంగీకరింంచారని చెబుతున్నారు. వీరందరితో బహిరంగసభలో పాల్గొంటారు.
సహజంగానే మోదీ సభ నిర్వహించి వెళ్లిన మూడు, నాలుగు రోజులకే పోలికలు వస్తాయి. జాతీయ నేతలు.. పలువురు సీఎంలు హాజరవుతున్నందున.. హైప్ కూడా వస్తుంది. బీజేపీ కన్నా తామే గొప్ప బహిరంగసభ నిర్వహించామని చాటే అవకాశం కూడా వస్తుంది.