తెలంగాణ గవర్నర్ తమిళిశైపై సీఎం కేసీఆర్కు చాలా ఆగ్రహం ఉందని అందరికీ తెలిసిన విషయం. ఆమెను గవర్నర్ గా అవసరమైనప్పుడు మాత్రమే గుర్తిస్తారు. మరే సందర్భంలోనూ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓ మంత్రితో గురువారం ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్. ఆ సమయంలో ముఖాముఖి కేసీఆర్ చర్చలు జరిపారు. వాళ్లేం చర్చించారో అన్న సంగతి రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే అలా చర్చించుకున్న ఒక్క రోజులోనే గవర్నర్ ను సచివాలయానికి ఆహ్వనించారు.
సచివాలయంలో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గవర్నర్ రావడానికి ముందే సచివాలయం గేటు వద్దకు వెళ్లి నిలబడ్డారు. తాను స్వయంగా ఆమెను ఆహ్వానించారు. ఆలయంలో పూజలు పూర్తయ్యాక.. సచివాలయంలోని సీఎంవో అధికారులు .. తన చాంబర్ ఉండే ఆరో అంతస్తుకు స్వయంగా తీసుకెళ్లారు. సచివాలయం మొత్తాన్ని చూపించారు. అసలు ఇక్కడ కొసమెరుపేమిటంటే ఇదే సచివాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించలేదు. పైగా రాలేదంటూ మంత్రులు విమర్శలు గుప్పించారు. కానీ పిలవనే లేదని గవర్నర్ మండిపడటంతో.. అంతా సైలెంట్ అయ్యారు.
కేసీఆర్ ఇప్పుడు గవర్నర్ తో ఇంత సఖ్యతగా ఎందుకు ఉంటున్నారన్నది బీఆర్ఎస్ వర్గాలకూ అంతు చిక్కడం లేదు. కేబినెట్ ఆమోదించిన రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆర్టీసీ విలీనం బిల్లుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. వాటి కోసమే కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని.. ఆ సంతకాలు అయిపోయిన తర్వాత మళ్లీ కామన్ గానే వివాదాలుంటాయని.. బీఆర్ఎస్ లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.