కొంతమంది నాయకులు నిత్యం వార్తల్లో ఉండేందుకే ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే, దానికే అలవాటుపడి ఉంటారు! మీడియా ముందుకు రాకపోతే ఏదో కోల్పోయినట్టు అయిపోతుంటారు. అలాంటి నేతల్లో ఎర్రబెల్లి దయాకరరావు ఒకరు! తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన హల్ చల్ చేసేవారు. ఏదో ఒక రూపంలో ప్రతీరోజూ మీడియా ముందుకు వచ్చేవారు. ఏదో ఒక విషయమ్మీద మాట్లాడుతూ ఉండేవారు. కానీ, ఆయన తెరాసలోకి వెళ్లిన తరువాత ఏమైంది..? ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకరరావు ఎక్కడున్నారు..? అధికార పక్ష నాయకుడిగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించే పని కూడా ఆయనకి ఎందుకు అప్పగించడం లేదు..? ఇంతకీ తెరాసలో ఎర్రబెల్లి ఉనికి ఏంటనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఉన్నట్టుండి ఈ ప్రశ్న ఇప్పుడే ఎందుకు తెరమీదికి వచ్చిందటారా.. దానికీ కొన్ని కారణాలున్నాయని తెలుస్తోంది.
ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎర్రబెల్లి చాలా ప్రయత్నించాల్సి వచ్చిందిట. నాలుగైదుసార్లు కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయిందట. సీఎం మాత్రమే కాదు.. ఇతర మంత్రులను కలవాలన్నా కూడా ఎర్రబెల్లికి కష్టసాధ్యంగానే ఉంటోందట. ఏదో అవసరం మీద కొంతమంది మంత్రులను వరుసగా కలుసుకునేందుకు ఇటీవలే ఎర్రబెల్లి ప్రయత్నిస్తే… సదరు మంత్రులు ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారట. ఈ పరిస్థితిని ఎర్రబెల్లి ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు! ఇప్పుడు ఇదే అంశం తెరాసలో చర్చనీయం అవుతోంది. సొంత పార్టీకి చెందిన నాయకుడిని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ చర్చ జరుగుతోంది. ఈ అనుభవాలతో ఎర్రబెల్లి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనీ, ఉక్కపోత ఫీల్ అవుతున్నారనీ అనుకుంటున్నారు.
తెలుగుదేశంలో ఉండగా ఎప్పుడూ మాట్లాడుతూ, వార్తల్లో ఉండే ఎర్రబెల్లికి తెరాసకు వెళ్లగానే ప్రాధాన్యత తగ్గిపోయిందా అనే అనుమానం కలుగుతోంది. పైగా, ఏదో పదవి ఆశించి తెరాసలోకి వెళ్లారు. కనీసం అది దక్కినా కూడా ఇలాంటి ప్రాధాన్యతలూ ఉక్కబోతలూ అనే చర్చ ఉండేది కాదు. దేన్ని ఆశించి తెరాసలోకి వచ్చారో అదీ నెరవేరలేదు. కనీసం మీడియా ముందుకు వెళ్లి ఏదో అంశంపై మాట్లాడదామని అనుకున్నా కూడా ఆంక్షలు ఉన్నాయట! ఏ అంశంపై మీడియా ముందు స్పందించాలనేది పార్టీ నుంచి ఆదేశం వచ్చాకనే మాట్లాడాలనీ, సొంత నిర్ణయాలు వద్దనీ తెరాస అధినాయకత్వం కొంతమందికి చెప్పిందనీ, ఆ కొంతమందిలో ఈయన కూడా ఉన్నరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కొంతమందిలో ధర్మపురి శ్రీనివాస్, కేకే పేర్లు కూడా ఉన్నాయట. ఏదేమైనా, ఇదంతా ఫిరాయింపుల ఫలితం.. అనుభవించాల్సిందే. తెలుగుదేశంలో ఉండగా రేవంత్ రెడ్డికి సరిసమాన నేతగా తెర మీద ఉండేవారు. ఇప్పుడు ఆయన గురించి గుర్తు చేసుకుంటే తప్ప.. ఎర్రబెల్లి దయాకరరావు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారనే సంగతి గుర్తులేని పరిస్థితి..! ఈ ఉక్కబోత రానురానూ ఉనికి కోల్పోయే స్థాయికి చేరితే… ఆ తీవ్రతను ఎర్రబెల్లి ఎలా బయటపెడతారో, భరించేస్తారో చూడాలి మరి!