బాప్ ఏక్ నెంబర్ కా.. బేటా దస్ నెంబర్ కా.. అంటూ ఒక సామెత ఉంది. అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న తరహా సామెత ఇది హిందీలో! ఇప్పుడు తెలంగాణలో ఈ ఇద్దరు నాయకుల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.
కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఇదేమీ ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ వైషమ్యాలు లేదా పోటీ తత్వానికి సంబంధించిన వార్త కాదు. వారి వారి పొలాల్లో వారు సాగుచేస్తున్న పంటలు మరియు సాధిస్తున్న అధిక దిగుబడుల గురించిన కబురు మాత్రమే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయం అంటే చాలా ఆసక్తి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఆయన తన ఫాంహౌస్లో ఎప్పుడూ ఏయే పంటలు సాగుచేయాలనే అంశం దగ్గరినుంచి అన్ని విషయాలు దగ్గరుండి పట్టించుకుంటూ ఉంటారు. తన తోటల్లోనే కోట్లరూపాయలు ఆర్జిస్తున్నట్లు ఆయన నిర్మొహమాటంగా చెప్పుకుంటారు. కేసీఆర్ అల్లంసాగు అంటే అందరికీ ఫేమస్ కూడా! ఆరకంగా వ్యవసాయ దిగుబడుల పరంగా, కొత్త తరహా పంటల సాగు పరంగా, కేసీఆర్ ఒక తరహా రికార్డులు సృష్టిస్తూ ఉంటే… ఆయన కేబినెట్లోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాంప్రదాయ పంటల్లోనే అత్యధిక దిగుబడులు సాధిస్తూ మరో రకం రికార్డును సృష్టిస్తున్నారు.
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఉండే తుమ్మల నాగేశ్వరరావు పొలంలో ఒక ఎకరాకు 53 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా వ్యవసాయ అధికారులే ధ్రువీకరించడం విశేషం. మండలంలో ఈ ఏడాది సాధారణ దిగుబడి 30 నుంచి 35 బస్తాలు మాత్రమే ఉండగా.. మంత్రి తుమ్మల తన 14 ఎకరాల్లో యంత్రాల ద్వారా వరి నాటించి సేద్యం చేశారుట. 60 శాతం రసాయన, 40 శాతం సేంద్రియ ఎరువులు వాడారుట. వేపపిండి, ఆముదం పిండి వంటివి వాడారుట. మొత్తానికి పొలంలో తిరుగులేని రికార్డు లాగా ఎకరాకు 53 బస్తాల దిగుబడి సాధించారని అధికార్లు అంటున్నారు.
కేసీఆర్ సేద్యపు విజయాలు, ప్రస్తుతం తుమ్మల సాధించిన అధిక దిగుబడి చూస్తే.. పైన చెప్పుకున్న కేసీఆర్ ఏక్ నెంబర్కా.. తుమ్మల దస్ నెంబర్ కా అనే సామెత నిజమే అనిపిస్తుంది. ఈ నాయకులకు ఇంతింత దిగుబడులు వస్తాయి గానీ.. పాపం.. సామాన్యులకే దిగుబడులు రాక.. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.. ఎందుకో అర్థం కాదు!