బీజేపీ, కాంగ్రెసేకత ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ధాకరేతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాలు మరియు అభివృద్ధి గురించి ఉద్ధవ్ ఠాక్రేతో సుదీర్ఘ చర్చ జరిగిందని.. అనేక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిందని కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు వారిని త్వరలో కలుస్తాననని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో అందరం హైదరాబాద్‌లో సమావేశమై చర్చిస్తామన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో పెనుమార్పులు అవసరమని ఉద్దవ్ ధాకరే కూడా అంగీకరించారని కేసీఆర్ తెలిపారు.
మహారాష్ట్ర నుంచి ఏ ఫ్రంట్ వచ్చినా అది విజయమేనని.. అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని ధాకరే సూచించారన్నారు. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రేను తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానిస్తున్నానని కేసీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, ప్రతీకార భావంతో చర్యలు తీసుకుంటున్న తీరును మేం సమర్ధించడం లేదని ఉద్దవ్ ధాకరే స్పష్టం చేశారు. ఈ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త రకం సమీకరణం ప్రారంభమైంది, దీన్ని పూర్తిగా రూపొందించడానికి ఖచ్చితంగా సమయం పడుతుందని తెలిపారు.
ఉద్దవ్ ధాకరేతో భేటీ తర్వాత కేసీఆర్ శరద్ పవార్‌తో సమావేశం అయ్యారు. ఆయనతో కూడా మూడో ఫ్రంట్ గురించి చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నాయి. ఈ కారణంగా ఆ పొత్తులను వదిలేసి ప్రకటనలు చేసే అవకాశం లేదు. అయితే కేసీఆర్ ప్రయత్నాలు ఓ రకంగా ముందడుగు పడుతున్నట్లేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతీయ పార్టీల నేతల సమావేశం ఉంటుందని కేసీఆర్ చెప్పడం దీనికి ముందడుగు అంటున్నారు.