కొన్నాళ్ల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండలో మూడు రోజులు పర్యటించారు. అక్కడ తన సహజ శైలిలో… తెలంగాణ ప్రభుత్వానికి లక్షన్నర కోట్లిచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో… అమిత్ షా నల్లగొండలో ఉండగానే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ఎంత ఇచ్చిందో.. కేంద్రం తెలంగాణకు ఎంత ఇచ్చిందో లెక్కలు చెప్పి… చివరికి అమిత్ షాను… భ్రమిత్ షా అని తేల్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిన్నామొన్నటి వరకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగని అనుకూలత కూడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కూడా తాము బీజేపీకి అనుకూలం కాదనే చెబుతున్నారు. ఏ విధంగా చూసినా… అటు కేసీఆర్ కానీ.. ఇటు జగన్ కానీ… ఉన్నపళంగా బీజేపీ అధ్యక్షుడికి నైతికంగా నిలబడాల్సిన అవసరం లేదు. కానీ తిరుమలలో ఏదో జరిగిందంటూ హడావుడి చేస్తున్న బీజేపీ నేతలకు మద్దతుగా వీరు కూడా ఓ చేయి వేశారు. నేరుగా అమిత్ షా కు బహిరంగ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ అయితే నేరుగా ఫోన్ చేసి పరామర్శించారట. ఇక జగన్… చంద్రబాబే రాళ్లేయించాడని చెప్పి… తమ పరామర్శను … ప్రకటన ద్వారా పంపారు.
ఇంత హఠాత్తుగా… కేసీఆర్, జగన్ ఎందుకు అమిత్ షా కు ఆత్మీయులుగా మారిపోయారన్నది చాలా మందికి ఆశ్చర్యకమైన అంశం. ఒకప్పుడు భ్రమిత్ షాగా నిప్పులు చెరిగిన కేసీఆర్ …. ఇప్పుడు ఏదో జరిగిపోయినట్లు ఫోన్ చేయడం… అమిత్ షాను కూడా ఆశ్చర్య పరిచే ఉంటుంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలన్నీ బీజేపీ కోసమేనని చాలా రోజుల్నించి విమర్శలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్‌కు దగ్గరవుతాయనుకున్న పార్టీలను మాత్రమే ఆయన తన ఫ్రంట్‌లోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతే కాక.. ఎప్పుడూ లేనిది… బీజేపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబుపై ఓటుకు నోటు కేసును కూడా బయటకు తీస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్ రాజకీయాల కోసం… కేసీఆర్ …ఇప్పటి నుంచే… బీజేపీకి సపోర్ట్ ఇవ్వడానికో… బీజేపీ సపోర్ట్ తీసుకోవడానికో ….ఇలా వ్యూహాలు మార్చుకుంటున్నారని…టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అమిత్ షాపై ఎలాంటి బహిరంగ విమర్శలు చేయలేదు. అలాగని అనుకూల ప్రకటనలూ చేయలేదు. చేయలేని పరిస్థితి ఆయనది. కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డికి నరేంద్రమోదీ, అమిత్ షా ఇచ్చిన నైతిక మద్దతు చూసి.. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం వచ్చిందనట్లుంది. తిరుమలలో జరిగన ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు నేరుగా మద్దతు ప్రకటించారు. అమిత్ షాపై చంద్రబాబే దాడి చేయించారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రకటనతో..ఏపీలో పెద్దగా ఆశ్చర్యం కాలేదు. కారణం.. కొంత కాలం నుంచి బీజేపీకి వైసీపీ దగ్గరవడమే.
మొత్తానికి ఎన్నికల వేడి పెరిగే కొద్దీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సమీకరణలకు క్లారిటీ వస్తోంది. ముఖ్యంగా బీజేపీవైపు ఎవరెవరు..? అన్నదానిపై… ఎవరంతటికి వాళ్లే క్లారిటీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ఉన్న అవసరాలు వేరు. ముందు రాజకీయ జీవితాన్ని పొడిగించుకోవాలంటే.. కేసుల నుంచి బయటపడాలి. అది అమిత్ షా చేతుల్లోనే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధానం క్లియర్. కానీ… కేసీఆర్‌కు ఏం అవసరం అనేదే… ఎవరికీ అంతుబట్టని విషయం. బీజేపీతో సన్నిహితమైతే… ముస్లిం ఓటు బ్యాంక్ దూరమవుతుంది.ఇది కేసీఆర్‌కు ఇబ్బందే. అయినా… ఎందుకు దగ్గరవుతున్నారు..?. అనేది ఎవరికీ అర్థం కావడంలేదు. చివరికి తిరుమల పర్యటన కారణంగా… ఆమిత్ షాకు.. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఆత్మీయులు లభించారన్నదానిపై మాత్రం క్లారిటీ వచ్చేసింది.