కేంద్రంలో ఏ పార్టీకీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఎంపీ స్థానాలు రావనే ఒక స్పష్టమైన అంచనా అందరిలోనూ ఉంది. అందుకే, ఎవరికివారు ఇప్పట్నుంచే కూటములను కట్టేందుకు జాతీయ పార్టీలు రెండూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసింది. ఆ దిశగా ప్రయత్నాలను సోనియా గాంధీ ప్రారంభించారు. దేశంలోని భాజపా వ్యతిరేక పార్టీలతోపాటు, యూపీయే భాగస్వామ్య పక్షాలు, తటస్థ రాజకీయ పార్టీలకు కూడా ఆమె ఓ లేఖ రాశారు. ఈ నెల 23న ఢిల్లీలో నిర్వహించే భేటీకి అందరూ రావాలంటూ ఆహ్వానాలు పంపించారు. దేశ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన చర్చలో అందరూ పాల్గొనాలని ఆమె కోరారు. ఈ క్రమంలో తెలంగాణలో తెరాస, ఏపీలో టీడీపీ, వైకాపాలకు కూడా ఆహ్వానాలు పంపినట్టు సమాచారం.
దీంతో, కాంగ్రెస్ విషయంలో సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిల వైఖరి ఏంటనేది ఇప్పుడు మరోసారి చర్చనీయం కాబోతోంది. కాంగ్రెస్, భాజపాల ప్రమేయం లేని ఫెడరల్ ఫ్రెంట్ అంటూ తిరుగుతున్న కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్తారా అనేది చర్చ. అయితే, జాతీయ పార్టీల ప్రమేయం లేని ఫ్రెంట్ అని కేసీఆర్ అంటున్నా… అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయమూ కలిగేలా ఈ మధ్య కొన్ని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి, కేసీఆర్ అటైనా ఉంటారు, ఇటైనా ఉంటారనే ఒక స్థాయి నమ్మకం చాలామందిలో ఉంది!
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మరో చర్చ! అయితే, ఆయన కాంగ్రెస్ కి మద్దతుగా వెళ్లే అవకాశాలు తక్కువ. ఎందుకంటే, గతంలో అదే పార్టీతో జగన్ విభేదించిన గతం ఉంది. పైగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి టీడీపీ మద్దతునివ్వడాన్ని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసుకున్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొదట్నుంచీ చెబుతూ వస్తోంది. ఒకవేళ భాజపా మరోసారి అధికారంలోకి వచ్చినా ఏపీకి హోదా ఇవ్వదనేది సుస్పష్టం. కేంద్రంలో ఎవరైతే హోదాపై సంతకం పెడతారో వారికే మా మద్దతు అని జగన్ చాలాసార్లు చెప్పారు. ఆ లెక్కన కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగన్ కి ఫరక్ ఉండకూడదు. కానీ, ఇంకోపక్క కేసీఆర్ తో కలిసి భాజపాయేతర, కాంగ్రెసేతర ఫ్రెంట్ జై అన్నారు కదా! కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై గందరగోళంగా ఉంటూ వస్తున్న జగన్ వైఖరి ఏంటనే స్పష్టత వచ్చే అవకాశం ఉందనే భావించొచ్చు. చూద్దాం… సోనియా ఆహ్వానానికి కేసీఆర్, జగన్ లు వెళ్తారా వెళ్లారా అనేది.