తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ మేనల్లుడు హరీశ్ రావును ఇటీవల బాగా దూరం పెడుతున్నారా? ఎందుకంటే ఆయన పాల్గొనే చాలా సమావేశాల్లో హరీశ్ అగుపించడం లేదు. తన స్వంత సమీక్షలు, ప్రారంబోత్సవాలు ప్రసంగాలలోనే వంటరిగా దర్శనమిస్తున్నారు.ముఖ్యమంత్రిని పొగుడుతూ ప్రతిపక్షాలను తిడుతూ ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కెసిఆర్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. వాస్తవానికి కావాలనే ఆయన హరీశ్‌ను దూరం పెడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణముందనీ అంటున్నాయి. కెసిఆర్ ఎపి నేతలతో కొంచెం సన్నిహితంగా కనిపించగానే హరీశ్ రంగంలోకి దిగి తనే ఆ సంబంధాలు పెంచుకోవడానికి వ్యాపార ప్రయోజనాలు పంచుకోవడానికి అత్యుత్సాహం చూపించారట. ఇలా ఆంధ్ర నేతలను వ్యాపార సంబంధాల కోసం వాడుకోవాలని చూడటం సిఎంకు నచ్చలేదట. కవిత,కెటిఆర్ ఆంధ్రాలాబితో బాగా వుంటున్నారని విమర్శలు వుండేవి. కెసిఆర్ వాటిని ఎన్నడూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అదే ఆరోపణతో హరీశ్‌ను దూరం పెడుతున్నారని ఆయన అనుయాయులు విమర్శిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి వ్యూహాత్మక అడుగులను అర్థం చేసుకోలేక హరీవ్ ఆంధ్ర నాయకులతో మరీ భుజాలు రాసుకుని తిరిగి కోపం తెప్పించారని సిఎం సన్నిహిత బృందం సభ్యులు స్పష్టంగా చెబుతున్నారు. బహుశా ఇక హరీశ్‌కు గతంలోని స్థానం రాకపోవచ్చనీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన సంతోష్ సమన్వయ సమస్యలు చూస్తాడరని వారు వివరిస్తున్నారు. హరీశ్‌పై సహజ వైముఖ్యానికి ముసుగు తప్ప ఎపి నేతలకు కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యత నిస్తూ తమనే నిర్లక్ష్యం చేస్తున్నారని చాలామంది టిఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. ఇక్కడ ఆయన అంచనా కావాలి గాని సత్యాసత్యాలు ఎవరికి ఎంతవరకూ?