“పోడు” భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటే.. నెలాఖరు నుంచే ప్రారంభిస్తామన్నారు. నిజానికి అన్ని పార్టీలు ఒప్పుకు్న్న పోడు భూములకు పట్టాలివ్వడం అనేది చట్ట ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే పోడు భూములు అంటే అటవీ భూములు. అడవుల్ని నరికేసి..సాగుకు అనుకూలంగా చేసుకుని పంటలు పండించుకుంటున్న భూముల్ని పోడు భూములు అంటారు. ఈ అటవీ భూములకు పట్టాలివ్వడం అన్నది చట్ట ప్రకారం చెల్లదు.
అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం హ 2005కి ముందు నుంచి పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే పట్టాలివ్వాల్సి ఉంటుంది. 2005 డిసెంబర్ 13 కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలివ్వాలి. గరిష్ఠంగా నాలుగు హెక్టర్లు మాత్రమే సాగుచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే.. లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత ఉంది. అయితే ఇందులోనూ చాలావరకు పత్రాలను అప్పట్లో అధికారులు తిరస్కరించారు. 2005 తర్వాత ఇంకా కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం మాత్రం.. అలాంటి భూములకు హక్కులు కల్పించేందుకు అవకాశం లేదు.
కానీ కేసీఆర్ గత ముందస్తు ఎన్నికలకు ముందు అందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తానే బయల్దేరతానని.. అన్ని చోట్లకూ స్వయంగా పోతానని చెప్పారు. మంత్రివర్గం, అధికార గణం అందర్నీ తీసుకెళ్లి.. ప్రజా దర్బారు పెట్టి పోడు పట్టాలు ఇచ్చేస్తామన్నారు. ఆ తర్వాత ఒక ఇంచు కూడా ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇంకా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. అది అంతకంతకూ తీవ్రమవుతోంది.
తాజాగా అసెంబ్లీలోనూ ప్రకటన చేశారు. పట్టాలిస్తామన్నారు. ఎంత మందికి ఇస్తామన్నది క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరికి లెక్క ప్రకారం భూములు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాతోపాటు… వాళ్లకు విద్యుత్ కెనెక్షన్ ఇచ్చి… రైతు బంధు కూడా ఇస్తామన్నారు. కానీ… పట్టాలు తీసుకునే వాళ్లు భవిష్యత్లో అడవిని కాపాడే కాపాలాదారులు కావాలన్నారు. దీన్నిరాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తేలికగా పరిష్కారమయ్యే సమస్య కాదని.. ముందస్తు ఎన్నికల కారణంగా పట్టాలిచ్చేందుకు.. ఎప్పుడూ లేని విధంగా అఖిలపక్ష ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు.