కేసీఆర్ స్కీములంటే ఆషామాషీగా ఉండవు. ఎవరికైనా ఉచితంగా లక్షలే. దళిత బంధు కింద రూ. పది లక్షలు దళిత కుటుంబాలకు పంచుతున్నారు. ఎంత మందికి వస్తాయన్న సంగతిని పక్కన పెడితే.. దళిత కుటుంబాలన్నీ ఆశగా ఎదురు చూసే పరిస్థితి కల్పించారు. ఇటీవల బీసీ బంధు అని పేరు పెట్టకపోయినా చేతి వృత్తులు చేసుకునే బీసీ కుటుంబాలకు ఉచితంగారూ. లక్ష ఇచ్చేపథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. లక్షల సంఖ్యలో దరఖాస్తులొస్తే.. వందల మంది లబ్దిదారులకు మొదటి విడత ఇచ్చారు.ప్రతీ నెలా పదిహేనో తేదీన కొంత మందికి ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు వారు కూడా ఎదురు చూడాల్సిన వారి జాబితాలో చేరిపోయారు.
వారి సంగతి సరే మా సంగతేంటి అని మైనార్టీలూ ప్రశ్నిస్తూండటంతో.. వారికీ ఓ లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీ నేతలతో సమావేశం పెట్టిన హరీష్ రావు.. నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థికసాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని హరీశ్ తెలిపారు. వచ్చే నెలలోనే పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరు కూడా దాదాపుగా అందరూ దరఖాస్తులు చేసుకుంటారు. వీరిలో కొన్ని వందల మందికి ఇచ్చి మిగతా లక్షల మంది ఎదురుచూపులు చూసేలా చేస్తారు.
మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ వస్తే ఆ డబ్బులన్నీ వస్తాయని ఎదురు చూసేలా.. వారి ఓట్లు చెదిరిపోకుండా.. కేసీఆర్ ఈ స్కీముల రాజకీయం చేస్తున్నారని ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కానీ ఇది రివర్స్ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది.