రెండు, మూడునెలల్లో ఎనభై వేలఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో వెంటనే యాభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించి నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్లు రాలేదు. ఇప్పుడు ఇంకా రెండు, మూడు నెలలు అని చెప్పారంటే ఇంకా ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం కష్టమని నిరుద్యోగులు ఉసూరుమనే పరిస్థితి వచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక నుంచి ఉద్యోగాల గురించి “త్వరలో” ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇక ఏముంది నోటిఫికేషన్లే అన్నట్లుగా హడావుడి చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి… సాగర్ ఉపఎన్నికలు వచ్చాయి. అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలు వచ్చాయి. అయినా నోటిఫికేషన్లు మాత్రం రాలేదు. ఇంకా రెండు, మూడు నెలలు అనే ప్రకటనలే కేసీఆర్ చేస్తున్నారు. అదే సమయంలో దళిత బంధు పథకం అమలుపై తన విజన్ ను కూడా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే మార్చి కల్లా నియోజకవర్గానికి వంద మందికి చొప్పున దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
అందరికీ కాదు. కేవలం వంద మందికే. వచ్చే బడ్జెట్లోపు ఇలా అమలు చేసి… ఆ తర్వాత బడ్జెట్లో రూ. ఇరవై నుంచి ముఫ్పై వేల కోట్లు దళిత బంధుకు కేటాయించి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం ఇప్పటికే ఉంది. దీన్ని బలపరిచేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా ఆ వ్యూహంతోనే ఆపుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఏం చేసినా రాజకీయం పక్కా ఉంటుందని అంటున్నారు.