హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో దళిత బంధును ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు.. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా గిరిజన బంధును ప్రకటించారు. అయితే వెంటనే అమలు చేస్తామని ఆయన చెప్పలేదు. వీలు చూసుకుని అమలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో గిరిజనుల కోసం బంజారా భవన్‌ను కట్టించారు. ఆ భవనం ప్రారంభోత్సవం తర్వాత గిరిజనులతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పలు కీలక ప్రకటనలను కేసీఆర్ చేశారు.
రాబోయే వారంలోనే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలుకు జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆ జీవోను కేంద్రం అమలు చేయాలని కేసీఆర్ అంటున్నారు. ఆ జీవోను కేంద్రం అమలు చేస్తుందో లేదో చూస్తామన్నారు. తెలంగాణ వచ్చాక ఇస్తామని … ఉద్యమ సమయంలోకేసీఆర్ ఇచ్చిన హామీల్లో గిరిజనలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి ఆ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు పెంచకూడదని లేదు. తమిళనాడులో 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు. తెలంగాణకు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడంలేదు. చిల్లర రాజకీయాలు చేస్తున్న నేతలను అడుగుతున్నా వారికి ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. కానీ ఇంత వరకూ పరిష్కరించలేదు. మరోసారి అదే హామీ ఇచ్చారు. పోడు సాగుదారుల్ని గుర్తించడానికి కమిటీలు ఏర్పాటుచేశామని ..వారు గుర్తించగానే ఆదివాసీలకు పట్టాలు త్వరలోనే అందిస్తాం. వారికి రైతు బంధు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
అయితే కేసీఆర్‌కు ఈ సభకు ముందు నిరసనలు కూడా తగిలాయి. గిరిజనలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బంజారాభవన్ వద్ద నిరసన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ సర్కార్ పై గిరిజనులుఆగ్రహంగా ఉన్నారన్న అభిప్రాయం ఉండటంతో కేసీఆర్ .. మరోసారి రిజర్వేషన్లు, పోడు భూముల అంశాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. ఇది ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అన్నది టీఆర్ఎస్ వర్గాలుకూడా అంచనా వేయలేకపోతున్నాయి.