తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే బీజేపీని విమర్శఇంచాడనికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలి కాలంలో ఎప్పుడుప్రెస్ మీట్ పెట్టినా అదే చెబుతున్నారు. శనివారం సాయంత్రం కూడా అదే తరహాలో ప్రెస్ మీట్ పెడుతున్నారని మీడియాకు సమాచారం ఇచ్చే సరికి… అందరూ అదేఅనుకున్నారు కానీ.., సమ్‌థింగ్ స్పెషల్ ఉండొచ్చని అనుకున్నారు. ఎందుకంటే మునుగోడు ఉపఎన్నికతో.. రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిపై స్పందిస్తారేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్ర విధానాలపై మాత్రమే స్పందించారు.
నేతిబీరకాయలో నెయ్యి ఎలా ఉండదో.. నీతి ఆయోగ్‌లో నీతి అలా లేదని చెప్పడానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖలో ఆయన నీతిఆయోగ్ ఎలా నిరర్థకంగా మారిందో వివరించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం దీన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నీతిఆయోగ్ వల్ల రాష్ట్రాలు మరింత బలడాల్సి ఉందని..దీని వల్ల దేశం మరింత ధృతంగా తయారవుతుందన్నారు. కానీ గత ఏడేళ్లుగా నీతి ఆయోగ్ ఆశలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాలను బలహీనం చేశాయని లేఖలో పేర్కొన్నారు. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు.
దేశంలో అసహనం పెరిగిపోయిందని.. బుల్డోజర్లు, ఎన్ కౌంటర్లు, మత పరమైన వివాదాలు , అంతర్జాతీయ విమర్శలతో దేశానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అయినా కేంద్రం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. టీమ్ ఇండియా అనిచెబుతున్నారు కానీ నిర్ణయాలన్నీ వన్ సైడెడ్‌గా జరుగుతున్నాయన్నారు. చివరికి ప్రభుత్వాలు అప్పులు తీసుకునే విషయంలోనూ కట్టడి చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్దిపై ప్రభావం చూపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే ఇదే ప్రెస్మీట్లో కేసీఆర్ ప్రజలకు మరో వరం ప్రకటించారు. పది లక్షల మందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. యాభై ఏడేళ్లు దాటిన వారందరికీ పెన్షన్ మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయాల గురించిపెద్దగా మాట్లాడలేదు. అయితే.. ఒక్క సారిగా పది లక్షల పెన్షన్ల మంజూరు అంటే.. ఇదిముందస్తు ప్రణాళికాల్లో ఓ అడుగు కావొచ్చన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.