తెలంగాణ సీఎం కేసీఆర్ 2024 తర్వాత తానే ప్రధాని అవుతానని.. ఆ తర్వాత దేశమంతా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామనిప్రకటించారు. ఏదైనా చెప్పడానికి విశ్వాసం ఉండాలన్ని .. అది తనకు ఉందన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహన్ని అవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఊహించని ఆదరణ కనిపిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో వస్తోన్న ఆదరణరను చూసి తాను షాక్ అయ్యానన్న సీఎం భవిష్యత్తులో యూపీ, బిహార్ లో కూడా ఆదరణ వస్తుందని తెలిపారు.
తెలంగాణలో ఇప్పటికే 50 వేల మందికి దళితబంధు ఇచ్చామని, మరో 25 వేల మందికి దళితబంధు అందించనున్నామని చెప్పుకొచ్చారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానని సీఎం చెప్పారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తన చేతుల మీదుగా చేయడం అదృష్టం గా భావిస్తున్నాని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నూతన సచివాయలానికి అంబేడ్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి రోజు సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలని కోరారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలన్నారు.
తాము పెట్టింది అంబేద్కర్ విగ్రహం కాదని, విప్లవమన్నారు. ఈ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదని, తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ పేరిట ఒక శాశ్వతమైన అవార్డు నెలకొల్పి, దేశంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఇస్తామన్నారు.ఈ అవార్డు పేరిట రూ.51 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చిన రూ.3 కోట్ల వడ్డీతో…దేశంలో ఉత్తమ సేవలందించిన వారికి అంబేడ్కర్ జయంతి రోజున అవార్డులు అందజేస్తామన్నారు. రూ. 51 కోట్లతో శాశ్వత నిధి ఉంటుందన్నారు.