ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో.. తెలంగాణలో రైతులను గుక్కతిప్పుకోనీయడం లేదు.. సీఎం కేసీఆర్. రైతు బంధు పథకం కింద.. సాగుభూమి ఉన్న ప్రతి ఒక్కరికి.. ఎకరాకి రూ. 4వేల చొప్పున పంపిణీ చేశారు. అక్టోబర్, నవంబర్‌లో రెండో విడత కూడా పంపిణీ చేయబోతున్నారు. ఈ లోపే.. రైతు బీమాను కూడా… తీసుకొచ్చారు. ఇప్పుడు ఉచితంగా యూరియాను కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ ముందు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో విధివిధానాలు ఖరారు చేయిస్తారు. ఇప్పుడు కూడా అంతే.. యూరియా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు ఉచితంగా యూరియా సరఫరా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. వానాకాలం, యాసంగిలో ఏ పంట సాగు చేసినా యూరియా వినియోగం తప్పనిసరి. దీంతో రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే యూరియా కోసం ఎరువుల దుకాణాలకు పరుగులు పెడుతుంటారు. ఈ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ యూరియా ఉచితంగా ఇస్తే రైతులు నెత్తి మీద పెట్టుకుంటారని డిసైడయ్యారు. ప్రస్తుతం యూరియాపై రైతులకు ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. కేంద్రం కొంత రాయితీ భరిస్తున్నప్పటికీ అది నేరుగా కంపెనీలకే అందిస్తోంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం.
తెలంగాణ రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ చేయాలంటే.. రూ.510 కోట్ల వ్యయం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం నేరుగా కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం రూ.500 కోట్లు భరించడానికి సిద్ధపడితే, రైతులకు ఉచితంగా యూరియా అందించవచ్చంటున్నారు. కొన్ని వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తున్న కేసీఆర్ దీని కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేయకుండా ఉంటారా..? అయితే.. ఇది కూడా.. రైతు బంధు పథకంలాగే.. భూయజమానులకే ఇస్తారా..? లేకనిజంగా పంటలు సాగు చేసుకునేవారికి ఇస్తారా అన్న సందేహం కూడా చాలా మందికి రావడం సహజమే. ఎందుకంటే.. సాగు చేయని వాళ్లకు ఇస్తే.. వాళ్లు మళ్లీ బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తారు. అప్పుడు కౌలు రైతులే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేసీఆర్ ఏమైనా ఆలోచన చేస్తారో లేదో మరి..!