చిత్రసీమకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రోజుకి ఎన్నంటే అన్ని ఆటలు ప్రదర్శించుకునేందుకు, టికెట్ రేట్లను సీజన్‌ని బట్టి, డిమాండ్ ని బట్టి పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యానికి అనుమతులు ఇచ్చేశారు. ఈరోజు సీఎమ్ ప్రెస్ మీట్లో… చిత్రసీమపై బాగా కనికరం చూపించినట్టు కనిపించింది. 10 కోట్ల లోపు నిర్మించే చిత్రాలకు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిన్న సినిమాలకు ఇది భారీ ఊరట. కరోనా కారణంగా థియేటర్లు చాలా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని మరో వరం ప్రకటించారు.
అన్నీ బాగానే ఉన్నా, టికెట్ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం థియేటర్ యాజమాన్యానికి వదిలేయడం మాత్రం.. ప్రేక్షకుడి నడ్డి విరగడం ఖాయం అన్న సంకేతాల్ని పంపుతోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే 150 వదిలించుకోవాల్సివస్తోంది. కొత్త సినిమా విడుదల అయిన రోజు టికెట్ రేటు 500 పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిర్మాతలకు ఓ విధంగా ఇది లాభదాయకమైన నిర్ణయం. కాకపోతే.. ప్రేక్షకుల పరిస్థితే ఆలోచించుకోవాలి. మొన్నటి వరకూ.. బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. ఫ్యాన్స్ షోలు పడేవి కావు. ఇప్పుడు… వీటికీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టైంది.