తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ కేసీఆర్ చాంపియన్లకు సాయం చేసే విషయంలో మాత్రం ఆలోచించడం లేదు. మహిళల వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్లో బంగారు పతకం సాధించిన ఈషా సింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించారు. వీరిద్దరికీ చెరో రూ.2 కోట్ల నగదు బహుమతి రూపంలో అందించాలని నిర్ణయించింది. ఇంటి స్థలాలు కూడా ఇస్తారు.
గత నెలలో జరిగిన మహిళల ప్రపంచ చాంపియన్ షిప్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 52 కేజీల విభాగం ఫైనల్స్‌లో ఇండోనేషియాకు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌పై 5-0తో నిఖత్ విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన ఐదో మహిళగా నిఖత్ జరీన్ నిలిచింది. గతంలో మేరీ కోమ్ , సరితా దేవి, జెన్నీ ఆర్.ఎల్., లేఖ కే.సీ. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు.ఇటీవలే జర్మనీలో ముగిసిన జూనియర్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో ఈషా సింగ్ మూడు స్వర్ణాలు సాధించింది. దీంతో వీరిద్దరినీ సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కేసీఆర్ నజరానాను ప్రకటించక ముందే .. ఆ క్రీడాకారులు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. మోదీ వారితో సెల్ఫీలు దిగారు. అయితే అక్కడ ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. కానీ కేసీఆర్ మాత్రం.. అదే సమయంలో రూ. రెండు కోట్లు ప్రకటించి.. అందరి దృష్టిని ఆకర్షించారు .