భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు కాస్త యాక్సెస్ ఇస్తున్నారు. వారానికో రోజు అయిన కొంత మందికి సమయం ఇస్తున్నారు. మెల్లగా ఆయన జనంలోకి వస్తున్నారని అనుకోవచ్చు. ముందుగా ఆయన దగ్గరకే జనాన్ని పిలిపించుకుంటున్నారు. తర్వాత ఆయన జనంలోకి రావొచ్చు. అయితే కేసీఆర్ ఇప్పుడు ఇలా బయటకు రావడానికి కారణం ఉపఎన్నికలపై పెట్టుకుంటున్న ఆశలే.
సుప్రీం స్పందనతో బీఆర్ఎస్లో అశలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు విషయంలో బీఆర్ఎస్ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసింది. రెండింటిలోనూ సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు. కానీ ఆ సమయం ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు పట్టుబడుతుంది. మీరు చెప్పకపోతే మేమే చెబుతామని గత విచారణలో చెప్పడంతో ఇవాళ కాకపోతే రేపైనా అనర్హతా వేటు పడుతుందని బీఆర్ఎస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. అందుకే కేసీఆర్ ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న చోట్ల.. అంటే పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకున్న చోట.. కార్యకలాపాలను యాక్టివ్ చేస్తున్నారు.
స్టేషన్ ఘన పూర్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
స్టేషన్ ఘన్ పూర్ లో ఉపఎన్నికలు వస్తాయని.. అభ్యర్థిగా రాజయ్య పోటీ చేస్తారని.. గెలుస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఘన్పూర్ నుంచి కొంత మంది నేతల్ని రాజయ్య పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ వారితో మాట్లాడారు. రాజయ్యకే టిక్కెట్ ప్రకటించారు. గత ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి.. కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. రాజయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేశారు. కానీ ఆయనను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదు. కడియం శ్రీహరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేర్చుకున్నారు. దీంతో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. గతంలో రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేశారు. అయితే ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అయినా తర్వాత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. 2023లో మాత్రమే టిక్కెట్ నిరాకరించారు.
జగిత్యాల బాధ్యతలు తీసుకున్న కవిత
మరో వైపు జగిత్యాలలో ఉపఎన్నికలు వస్తాయని.. కవిత అక్కడ పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేశారు. అత్యంత నమ్మకంగా సంజయ్ కుమార్ కు చాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఉపఎన్నికలు వస్తే ఆయనను ఓడించాలని టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలు ఉధృతం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ యాక్టివ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఉపఎన్నికలు రావని.. స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించదని నమ్ముతున్నారు.