రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలని ఎదుర్కొంటోంది. రాష్ర్టం ఏర్పడినప్పటికీ రాజధాని లేదు. ఇంతవరకు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పాలకులు అందరూ హైదరాబాద్ నే అభివృద్ధి చేసుకుపోవడం వలన విభజన తరువాత చూసుకొంటే రాష్ట్రంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేకుండాపోయింది. కనుక రాష్ట్రంలో 13జిల్లాలని అభివృద్ధి చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కనుక రాష్ట్రం పూర్తిగా కేంద్రప్రభుత్వం దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడవలసి వస్తోంది. కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరమని గ్రహించినందునే చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తులు పెట్టుకొన్నారు. కానీ ఆయన ఆశించినట్లు కేంద్రం ఉదారంగా సహాయం చేయడం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ మొన్న చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఆర్ధికమంత్రి, నీతి ఆయోగ్ చైర్మన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖల ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు గంటన్నర సేపు సాగిన ఆ సమావేశంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏమేమి ఇవ్వబోతోందో నిర్దిష్టంగా ప్రకటించలేదు. ఏమేమి ఇవ్వాలో రోడ్ మ్యాప్ తయారుచేస్తున్నామని చెప్పింది అంతే.
ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో ముఖాముఖి సమావేశమయ్యారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పధకాలకి మూడేళ్ళకి కలిపి రూ.30,000 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత ఏడాది కేటాయించిన రూ.450 కోట్లకి అదనంగా ఇంకా ఎక్కువ నిధులు, కృష్ణా పుష్కరాలకి నిధులు ఇవ్వాలని కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆ రెండు పధకాలకి రూ.30,000 కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ స్వయంగా సిఫార్సు చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా ప్రధానికి గుర్తు చేసి ఈ ఏడాది వాటాగా రూ.10,000 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇంకా జిడిపి లెక్కల్ని సవరించడం, హైకోర్టు విభజన వంటి అనేక అనశాలని ప్రధాని దృష్టికి తీసుకువచ్చి అన్ని సమస్యలని పరిష్కరించాలని కోరారు.
తెదేపా, భాజపాలు మిత్రపక్షాలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా సాగుతున్నప్పటికీ, నిధుల కోసం చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తులని కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కానీ ఆయన అడిగిన దానికంటే చాలా ఎక్కువే సహాయం చేస్తోందని రాష్ట్ర భాజపా నేతలు చెపుతున్నారు. లేదని తెదేపా వాదిస్తోంది. తెలంగాణాలో కూడా ప్రస్తుతం ఇటువంటి వాదోపవాదాలే సాగుతున్నాయి. చంద్రబాబు విజ్ఞప్తులనే ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోనప్పుడు, నిత్యం తనని, తన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కెసిఆర్ విజ్ఞప్తిని పట్టించుకొంటారా? అంటే అనుమానమేనని చెప్పవచ్చు. ఒకవేళ తెలంగాణాకి ఉదారంగా నిధులు విడుదల చేస్తే, వాటిని ఉపయోగించుకొని ఆ క్రెడిట్ కెసిఆర్ స్వంతం చేసుకొంటారు తప్ప కేంద్రప్రభుత్వానికో లేదా రాష్ట్ర భాజపా నేతలకో ఇవ్వరు కదా? ఆంధ్రప్రదేశ్ లోను అదే పరిస్థితి నెలకొని ఉంది కనుకనే కేంద్రప్రభుత్వం చాలా ఆచి తూచి నిధుల విడుదల చేస్తున్నట్లుంది.