వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన ఎప్పుడూ జర్మనీలోనే ఉంటారు. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రం కూడా తేల్చింది. ఆయనపై అనర్హతా వేటు వేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ కోర్టుల్లో పిటిషన్లు వేయడం ద్వారా… ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు టిక్కెట్ నిరాకరించారు. అప్పుడు కూడా ఆయన జర్మనీలోనే ఉన్నారు.
అయితే అక్కడ్నుంచే… బీజేపీలో చేరుతానని లీకులు ఇచ్చారు. అందుకు చాన్స్ కూడా ఉంది., చెన్నమనేని ఫ్యామిలీలో చాలా మంది బీజేపీలో ఉన్నారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా చేశారు. అయితే… చెన్నమనేని రమేష్ తండ్రి రాజేశ్వరరావు కమ్యూనిస్టు పోరాటయోదుడు. ఆయన కాలంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. తర్వాత బలహీనపడటంతో కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం టీడీపీలో కుమారుడ్ని చేర్పించి టిక్కెట్ ఇప్పించారు. తెలంగాణ ఉద్యమం కారణంగా రమేష్ టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
ఇప్పుడు ఆయన బీజేపీలో చేరకుండా… ఓ కేబినెట్ హోదా పదవిని కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయరంగ వ్యవహారాల సలహాదారుగా చెన్నమనేని రమేష్ బాబు ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ హోదా పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు. ఎమ్మెల్యే గా జర్మనీ వెళ్లి అదనంగా క్యాబినెట్ హోదా లో వేములవాడ కి తిరిగి వస్తున్నారు రమేష్ బాబు.. శనివారం నుంచి ఆయన వేములవాడలో పర్యటించే అవకాశం ఉంది.