రోజూ తెలంగాణ భవన్ కు వస్తా… పార్టీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటా.. ఎవరైనా ఎప్పుడైనా కలవొచ్చు.. ఇది కేటీఆర్ స్టేట్ మెంట్. పార్టీ బాధ్యతలు మొత్తం ఇక కేటీఆరే చూసుకుంటారు… ఇదీ కేసీఆర్ ఇచ్చిన సందేశం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైన తర్వాత జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అంతిమంగా ఇద్దరి నుంచి వచ్చిన సందేశాల సారాంశం..ఇక పార్టీ బాధ్యతలు మొత్తం కేటీఆర్. ఇంత వరకూ బోధపడినా… చివరికి వచ్చే సరికి ఓ షాకింగ్ న్యూస్ ఈ మాటల్లోనుంచి బయటకు వస్తోంది. అదేమిటంటే.. కేటీఆర్ కు మంత్రి పదవి లేకపోవడం.
ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధాన కర్తగా కేటీఆర్ ఉంటారు. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం ఇప్పటిదాకా సరిగ్గా లేదనేది కేసీఆర్ భావన.ఇకముందు అన్ని స్థాయిల్లో బలోపేతం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం జరగాలనేది టార్గెట్ గా పెట్టారు. కేటీఆర్ పూర్తిగా పార్టీ వ్యవహారాలకే అంకితం అవుతారని చెప్పడంతో.. ఆయనకు మంత్రి పదవి లేదనే విషయంపై క్లారిటీ వచ్చినట్లయింది. పార్టీకి, ప్రభుత్వానికి కేటీఆర్ అనుసంధాన కర్తగా ఉంటారని కేసీఆర్ చెప్పినందున ఎటూ ప్రభుత్వ వ్యవహారాలపై పర్యవేక్షణ ఉంటుందని, అందువల్ల మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు తక్కువేననే పార్టీ వర్గాల్లో చర్చ ప్రారంభమయింది.
పార్టీపై పూర్తి స్థాయి పట్టు కేటీఆర్ సంపాదించుకుంటే.. ఆ తర్వాత నేరుగా ఎలాంటి పదవి వచ్చినా..ఇచ్చినా ఇబ్బంది ఉండదని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా పార్టీ వర్గాలపై పట్టు కోసం.. కుమారుడ్ని ప్రొత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలైన ఘట్టం పూర్తి చేయాలనుకుటున్నారు కాబట్టి.. ఆరు నెలల్లో పార్టీపై కింది స్థాయి నుంచి కమాండ్ సాధించాలని కేటీఆర్ కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. పార్టీ నేతలకే కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు.. అలాగే పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారికే స్పీకర్, మంత్రి పదవులు ఇస్తామని కూడా సంకేతాలిచ్చారు. గతంలో పనిచేసిన వారిలో ఈసారి మంత్రి పదవులు దక్కకపోవచ్చనే రీతిలో కేసీఆర్ సంకేతాలిచ్చారు.