ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్ళతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ ను వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్టీవాలా , జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. పవర్ కమిషన్ ఏర్పాటు నిబంధనల ఉల్లంఘేనని, ఈ కమిషన్ కు అధిపతిగా ఉన్న జస్టిస్ నరసింహా రెడ్డి విచారణకు ముందే తమకు వ్యతిరేకంగా కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారని, దాంతో నరసింహరెడ్డి ఈ బాధ్యతలో కొనసాగలేరంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేసీఆర్ తరఫు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ఏర్పాటులో నిబంధనలు ఉల్లంఘన ఏమి లేదని…నిబంధనల మేరకే కమిషన్ నోటీసులు జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తమ ఎదుట హాజరు కావాలంటూ పవర్ కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఖాయంగా కనిపించింది. దీంతో కేసీఆర్ ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.