పద్దెనిమిదో తేదీన మంత్రివర్గ వస్తరణ జరపాలని.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎనిమిది మందితో మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించబోతున్నారని.. ఇప్పటికి వెల్లడయిన సమాచారం. అయితే.. ప్రమాణస్వీకారాల్లేకుండానే… పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలకు “మంత్రి” హోదా ఇవ్వ బోతున్నారు. అదే వారికి ” మంత్రి ” అనే పేరు మాత్రం ఉండదు. వారికి పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులనే పేరు ఉంటుంది. అంటే… పేరు లేకుండా.. మంత్రి హోదాను అనుభవించేలా అవకాశం ఇవ్వడం అన్నమాట.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ మీటింగ్ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఓకే చెప్పింది. అయితే ఈ పేరును పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులుగా మార్చారు. న్యాయపరమైన చిక్కులు ఉండటమే కారణం. వాస్తవానికి రాజ్యాంగంలోని 164 నిబంధన ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మందిని మాత్రమే మంత్రులుగా నియమించే వీలుంది. ఇతరులను పార్లమెంటరీ కార్యదర్శల పేరుతో నియమించినా.. కోర్టులు కొట్టి వేశాయి. అయినప్పటికీ.. పేర్లు మార్చి.. కొన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నారు. అదే పద్దతిని కేసీఆర్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు.
పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు నేరుగా ప్రమాణం చేయరు కానీ… వారికి మంత్రికి సంబంధించిన అధికారాలన్నీ ఉంటాయి. అయితే… న్యాయపరమైన చిక్కులొస్తాయి కాబట్టి.. కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం లేదు. మంత్రుల తరపున అసెంబ్లీలో సమాధానం చెప్పేలా చట్టంలో మార్పు తేవాలని నిర్ణయించారు. నిజానికి గతంలోనే..పార్లమెంటరీ కార్యదర్శులు ఉన్నారు. కానీ కోర్టు కొట్టేయడంతో… వారిని తప్పించారు. మళ్లీ నియమించలేదు. ఈ సారి కొత్త పేరుతో నియమించాలని నిర్ణయించారు. అప్పట్లో కోర్టు చేసిన వాఖ్యలను పరిగణనలోకి తీసుకొని కొత్తనిబంధనలు తేవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తికి గురయ్యేవారిని.. ఈ పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శల పదవులతో… కేసీఆర్ సంతృప్తి పరచనున్నారు.