బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పార్టీకి కష్టకాలం మొదలైనట్లుగా రాజకీయ పరిణామాలే రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరగా మరికొంతమంది పార్టీని వీడెందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. సన్నిహిత నేతలు కూడా పార్టీని వీడుతుంటే వారిని నిలువరించలేని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ , మల్కాజ్ గిరి లోక్ సభ సెగ్మెంట్ లపై బీఆర్ఎస్ అధిష్టానం భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ, మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తున్నాడంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. మీడియా ముంగిట ఈటలను ఆలింగనం చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలపై కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించేవారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు మల్కాజ్ గిరిలో నష్టం చేస్తాయని తెలిసినా కూడా ఆయనపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం కేసీఆర్ రాజకీయ నిస్సహాయతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈటల గెలుస్తున్నారని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. బీజేపీ – బీఆర్ఎస్ ఒకటే అనేందుకు ఇదే ఉదాహరణ అంటూ ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రమోట్ చేస్తోంది. చూశారా ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీ నేతలు ఎలా కలిసిపోతున్నారో అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.