తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఆ క్రెడిట్ ఇప్పటికీ దక్కడం లేదు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన తనకీ రాజకీయంగా ఆస్థాయి ప్రాధాన్యత దక్కలేదన్న అభిప్రాయం సీనియర్ నేత జైపాల్ రెడ్డిలో ఇప్పటికీ అలానే ఉందని అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు విషయంలో తానే గోల్ కొట్టాననీ, తానే దగ్గరుండి ప్రక్రియ అంతా పూర్తి చేశానని మరోసారి గుర్తు చేసుకున్నారు సీనియర్ నేత జైపాల్ రెడ్డి. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిననాటి పరిస్థితులతోపాటు, ఆ సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ తనతో ఏమన్నారనే కొన్ని ఆసక్తికర అంశాలను ఒక ఇంటర్వ్యూలో జైపాల్ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును తానే స్వయంగా స్పీకర్ ఛాంబర్ లో కూర్చుని దగ్గరుండి పాస్ చేయించా అన్నారు. ఈ బిల్లు విషయంలో స్పీకర్ తప్పు చేశారని ఆంధ్రా నేతలు తీవ్రంగా విమర్శించారనీ, కానీ నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని జైపాల్ చెప్పారు.
తెలంగాణ బిల్లు పాస్ చేసినా ఆ మేరకు ఎన్నికల్లో ఎందుకు లబ్ధి పొందలేకపోయారనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. బిల్లు ఆఖరి నిమిషంలో పాస్ కావడంతో తమకు సమయం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయామన్నారు. అంతేకాదు, బిల్లు విషయంలో తాను చేసిన సాయం కూడా కేసీఆర్ ఖాతాలో పడిపోయిందనీ, ఉద్యమం ఎవరు చేసినా ఆ బ్రాండ్ నేమ్ కేసీఆర్ కు మాత్రమే వచ్చిందన్నారు. తనను కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారనే ప్రతిపాదన కూడా అప్పట్లో వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని నాడు కేసీఆర్ తనతో మాట్లాడారనీ, తెలంగాణ రావడానికి తాను చేసిన సాయాన్ని కేసీఆర్ మెచ్చుకుంటూనే, బ్రాండ్ ఇమేజ్ మాత్రం తనకే దక్కాలన్నారని గుర్తు చేసుకున్నారు. ‘మీరే ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అన్నారు. నేను కాదు మీరైతేనే బాగుంటుందని మర్యాదపూర్వకంగా ప్రతిస్పందించాను. కానీ, ఆ తరువాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చేసరికి కేసీఆర్ ఈ విషయాన్ని మరచిపోయారు’ అంటూ జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనీ, తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాదనుకున్న తెలంగాణ తానే తెచ్చానని కేసీఆర్ ప్రచారం చేసుకోవడంతో ప్రజలు నమ్మారనీ, అదే క్రమంలో ఆయన ఇచ్చిన హామీలు నిజం చేస్తారని ప్రజలనుకున్నారనీ.. కానీ, కేసీఆర్ ఏమీ చెయ్యలేకపోయారని జైపాల్ అన్నారు. పరోక్షంగా కేసీఆర్ మీద ఉన్న నాటి అసంత్రుప్తిని ఇలా బయటపెట్టుకున్న జైపాల్ అనుకోవచ్చు.