ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ ఏం చేసినా గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటారు! ఏది ప్రకటించినా అటెన్షన్ అంతా ఆయనవైపు తిప్పుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం విషయంలో కూడా అదే పంథాని అనుసరిస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. దాదాపు ఎనిమిదిన్నర గంటలసేపు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. మళ్లీ ఇవాళ్ల ఉదయమే పదిన్నర అయ్యేసరికి అందర్నీ ప్రగతి భవన్ కి వచ్చేయమని ఆదేశించారు. కానీ, ఇవాళ్ల సమావేశం ఎక్కడ జరుగుతుందనేది మాత్రం చెప్పలేదు! అందరూ వచ్చిన తరువాత ఎక్కడకి వెళ్లి సమావేశం కావాలనేది తరువాత చెబుతా అన్నారు. అంటే, సీఎంతో సహా అందరూ కలిసి అప్పుడు బయల్దేరి వెళ్తారు.
రెవెన్యూ చట్టంలో ఉండబోయే అంశాల గురించి ఎవ్వరూ ఎక్కడా మాట్లాడటానికి వీల్లేదని కేసీఆర్ ఆదేశించినట్టుగా తెలిసింది. మంత్రులుగానీ, కలెక్టర్లుగానీ దీనికి సంబంధించి ఏ విషయమూ మీడియాతోగానీ, ఆఫ్ ద రికార్డ్ గా సన్నిహితుల దగ్గరగానీ చర్చించకూడదన్నారు. ఈ రోజు జరగబోయే మీటింగ్ ముగియగానే మంత్రులూ కలెక్టర్లూ ఏ ఒక్కరూ ఎలాంటి మీడియాలో కనిపించడానికి వీల్లేదన్నారు! నిన్నటి సమావేశం తరువాత అలానే ఎవ్వరూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అంతేకాదు, సాధారణంగా ఇలాంటి సమావేశాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనను అధికారికంగా విడుదల చేస్తుంది. ఇప్పుడు అది కూడా లేకపోవడం విశేషం. ఎవ్వర్నీ మాట్లాడొద్దంటే, దీని గురించి ఎవరు చెప్తారు..? అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి, సుదీర్ఘంగా అన్నీ వివరిస్తారని సమాచారం.
రెవెన్యూ చట్టం ప్రకటన విషయంలో మరీ ఇంత అవసరమా అనిపిస్తుంది. అయితే, ఇక్కడే కేసీఆర్ తీరు బయటపడుతోంది. కొత్త చట్టం గురించి ఆయన ఒక్కరే మాట్లాడితే… దాన్ని ఆయన ఒక్కరే ప్రకటిస్తే… ఫోకస్ అంతా ఆయన మీదే ఉంటుంది కదా! కేసీఆర్ ఉద్దేశం అదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఏదైతేనేం, కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నట్టుగా సమాచారం. ఇంకో విషయంలో… త్వరలో తెలంగాణలో జిల్లా కలెక్టర్లు అనే పదాన్ని కూడా మార్చబోతున్నట్టుగా తెలిసింది.