తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం.. చకచకా సన్నాహాలు చేసుకుంటోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో.. కేంద్రం నుంచి.. ఈసీ నుంచి పూర్తి స్థాయిలో సహకారానికి హామీ లభించిందన్న సూచనలకు తగ్గట్లుగా … ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటోంది. పెండింగ్ లో ఉన్న అత్యంత కీలకమైన నిర్ణయాలన్నింటికీ ఆమోద ముద్ర వేసేందుకు మంగళవారమే కేబినెట్ భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు.. ఏ అంశంలపై కేబినెట్ ఆమోద ముద్ర కావాలో.. వాటి ఫైళ్లన్నింటినీ రెడీ చేస్తున్నారు. పాలనాపరమైన అంశాలపై కీలకనిర్ణయాలు మంత్రివర్గం తీసుకోనుంది. అనేక వర్గాలను ఆకట్టుకునేలా తాయిలాలు ప్రకటించనున్నారు. ఢిల్లీ టూర్ ను సక్సెస్ చేసుకున్న కేసీఆర్… ఇక తదుపరి చర్యలపై దృష్టి పెట్టనున్నారు.
ప్రతి ఎన్నికలకు ముందు.. ఏ ప్రభుత్వమైన భారీగా ప్రభుత్వ అధికారులను బదిలీ చేస్తుంది. కొరుకుడు పడరు అనుకున్న అధికారులను లూప్ లైన్ లోకి పంపుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా.. అదే సన్నాహాల్లో ఉంది.ఇప్పటికే… అధికారుల బదిలీలపై కసరత్తు పూర్తి చేశారు. ఏ క్షణమైనా ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారుల బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 10 మంది కలెక్టర్లకు స్థానచలనం కల్పిస్తారన్నప్రచారం జరుగుతోంది. డైరెక్టర్లు, ఎండీలు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, జిల్లా ఎస్పీలు, కమిషనర్ల బదిలీలు ఉంటాయి. వీటిపై మరోసారి కేసీఆర్ సమీక్షించిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ముందస్తు ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం నుండి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు… వీలైనంత త్వరగా.. అసెంబ్లీని రద్దు చేయాలన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతంది. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో అసెంబ్లీ సమావేశాలు..అసెంబ్లీ రద్దును ప్రకటించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు తీర్మానం కోసం మరోసారి కేబినెట్ భేటిని నిర్వహిస్తారు. తీర్మానం చేసి గవర్నర్ కు పంపుతారు. ఆ తర్వాత పరిణామాలన్నీ వేగంగా సాగిపోతాయి. గవర్నర్ నుంచి కేంద్రం వరకూ..అందరినీ ఇప్పటికే కేసీఆర్ తనదైన ట్రాక్ లోకి తెచ్చుకున్నాడు మరి..!