ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో…ఈ నెల 5వ తేదీన కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్ ఈ అంశంపై స్పందించారు. ఈ విషయంలో రెండు రోజుల్లో అన్ని విషయాలు వెల్లడిస్తానని మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు. దీంతో ఆయన ఎలాంటి అంశాలను వెల్లడిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రెండు రోజుల్లో అన్ని విషయాలను వెల్లడిస్తానన్న కేసీఆర్ .. పది రోజులు అవుతున్నా పెదవి విప్పడం లేదు. దీంతో ఆయన ఎందుకు ఈ విషయంలో వెనక్కి తగ్గారనే చర్చ మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతుండటంతో ఇప్పుడు ఏం మాట్లాడవద్దని కేసీఆర్ నిర్ణయించుకున్నారా..? న్యాయనిపుణులతో పూర్తిస్థాయిలో చర్చించాకే మాట్లాడాలని భావిస్తున్నారా..? లేదంటే వారి సూచనల మేరకే మౌనం వహిస్తున్నారా..? ఈ కేసులో తనకు నోటిసులు వస్తే అప్పుడు స్పందించాలని అనుకుంటున్నారా..? అనే చర్చ మొదలైంది.
ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగిందని సస్పెండ్ అయిన అధికారులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్.. ఇప్పుడు ఈ విషయంపై ఎం మాట్లాడినా అది వివాదానికి దారితీస్తుందని.. అందుకే కొంతకాలం వెయిట్ చేయాలని న్యాయనిపుణులు సూచించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని ముందుంచుతూ సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మొగుడు, పెళ్ళాల సంభాషణలు కూడా వింటారా..? ఫైర్ అయ్యారు. దీంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎనికల ప్రచారాస్త్రంగా వాడుకొని బీఆర్ఎస్ ఇరకాటంలో నెట్టే అవకాశం ఉందని అంచనా వేసి…ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ వెనక్కి తగ్గారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత సమయంలో ఈకేసుపై ఏం మాట్లాడినా అది భూమ్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని బ్యాక్ స్టెప్ వేసినట్లు కనబడుతోంది. కానీ, రెండు రోజుల్లో అన్ని వివరాలను వెల్లడిస్తానని మీడియా ఎదుట ప్రకటించిన కేసీఆర్.. ఇంకా స్పందించకపోవడం పట్ల జనాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.