ఇందిరాపార్క్ ధర్నాలో కేసీఆర్ ఎక్కడా తాము ఢిల్లీలో పోరాడతామని ప్రకటించలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాయకత్వం తీసుకుని పోరాటం చేస్తామన్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ను నమ్మి ఆ పోరాటంలోకి రానిచ్చే అవకాశం కూడా ఉందో లేదో తెలియదు. ఆయనంతకు ఆయన వెళ్లి మద్దతు ప్రకటిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. అలా వెళ్తారో లేదో స్పష్టత లేదు. అనూహ్యంగా కేసీఆర్ ఢిల్లీ నుంచి కాకుండా.. గ్రామాల్లో బీజేపీకి వ్యతిరేకగా చావు డప్పు మోగిస్తామంటూ చెప్పడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. కేసీఆర్ కేంద్రంపై రాజకీయ పోరాటం ఉత్తదేనన్న అభిప్రాయానికి వస్తున్నారు.
నిజానికి కేసీఆర్కు ఇప్పుడు పోరాటం అవకాశం వచ్చింది. బియ్యం కొంటరా.. కొనరా అని కేసీఆర్ వేసిన ప్రశ్నకు కేంద్రం సూటిగానే సమాధానం చెప్పింది. కొనేది లేదని చెప్పింది. ఇక కేంద్రంపై సమరం ప్రకటించి… ఢిల్లీకి వెళ్లాల్సిన అవకాశం కూడా వచ్చినట్లయింది. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మరీ ముందడుగు వేయడానికి సిద్ధపడటం లేదు. ఎందుకో కానీ ఆయన రైతుల దగ్గరే ఆగిపోతున్నారు. వారికి ఎంతో చేశామని చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఎంతో చేశారన్న విషయం పక్కన పెడితే.. ఇప్పుడు చేయాల్సిన దాని గురించి మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇక్కడే మైనస్ అవుతోంది.
గతంలో వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలిచి ఇక కొనబోమని తెలంగాణ సీఎం చెప్పారు. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో పంట మొత్తం చివరి గింజ వరకూ రాష్ట్రమే కొంటుందని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రానికేం సంబంధం లేదన్నారు. ఇప్పుడు అదే మాటల్ని పట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. కొనేది రాష్ట్రమే అయినా అసలు సేకరించాల్సింది కేంద్రమని ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ వాదిస్తోంది. దీంతో సమస్య జఠిలమయింది. ఇప్పుడు తప్పంతా బీజేపీ వైపే ఉందన్న క్లారిటీ వచ్చింది. మరి కేసీఆర్ బీజేపీని ఎలా బుక్ చేస్తారు? రైతుల కోసం పోరాటాన్ని ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారన్నదే ఇప్పుడు కీలకం.