ఉద్యమ నాయకుడు కేసీఆర్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా తేడా ఉందని ప్రతిపక్షాలు ఈమధ్య ఘాటుగానే విమర్శిస్తున్నాయి. చాలా విషయాల్లో ఆయన గతంలో చెప్పిన మాటకు భిన్నంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో ఆయన అడ్డంగా మాట మార్చారని ప్రతిపక్షాలు తీవ్ర స్వరంగా విమర్శల దాడి చేస్తున్నాయి. ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు వింటే, ఇప్పుడు ఇంతలా మాట మార్చడం సాధ్యమా అని అనుమానం కలుగుతుంది. ఆనాడు అంత ఆవేశంగా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి అనర్గళంగా ప్రసంగించారు.
విమోచన దినోతవ్సం అధికారికంగా జరపక పోవడం తెలంగాణ ప్రజలను అవమానించడం అనే ఒక్క మాటే కాదు, ఆనాటి పాలకులను ఇష్టారీతిన తిడుతూ ఏకిపారేశారు. వారికి తెలంగాణ ఆత్మాభిమానం మీద గౌరవం లేదన్నారు. మన ఆత్మ గౌరవం వారికి అక్కర్లేదని తిట్టారు. ఆంధ్ర పాలకులమీద దుమ్మెత్తి పోశారు.
ఇప్పుడు బీజేపీ వారు ఆనాటి ప్రసంగాలను బయటపెట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేది లేదని కేసీఆర్ చెప్పడాన్ని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రసంగాల టేపులు, పత్రికా వార్తల క్లిప్పింగులు బయటపెట్టారు. వీటి సంగతి ఏందని సూటిగా ప్రశ్నించారు. ఉద్యమ నాయకుడిగా ఆనాడు అంత ఆవేశంగా ప్రసంగించిన వ్యక్తి, ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టారని, విమోచన దినోత్సవానికి గౌరవాన్ని ఇవ్వడం లేదని విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదు,
తాను ఒప్పుకోవద్దని ఫిక్స్ అయితే ఇక మొండిగా ఖండించడం కేసీఆర్ కు బాగా తెలుసు. సజీవ సాక్ష్యాలు కళ్లముందున్నా, కోట్ల మంది గొంతు చించుకున్నా, తనకు ఇష్టం లేని ససేమిరా ఒప్పుకోరు. ఇప్పుడు విమోచన దినోత్సవం విషయంలోనూ అదే జరుగుతోంది.