ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భిన్న సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో బిసిలకు రుణాలు గొర్రెలు చేపల పంపినీ వంటి కార్యక్రమాలు ప్రకటించిన ఆయన ఇప్పుడు వివిధ పార్టీల ఎంఎల్ఎలను పిలిపించి వారి సలహాలు ఆహ్వానించారు. కాంగ్రెస్ బిజెపిలకు చెందిన బిసి ఎంఎల్ఎలు కూడా వెళ్లారు గనక కొంత చర్చ జరిగింది. వారందరి సలహాలు ఇస్తే రెండు రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నది చెబుతానని ఆయన బంతి వారి వైపునకే వేశారు. బిజెపి అద్యక్షుడు కె.లక్ష్మణ్ ఈ సందర్భంగా ముస్లిములకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని కోరడం వూహించదగిందే. వాస్తవానికి ప్రభుత్వం అలాటి ఏర్పాటు చేయకపోయినా వారికి విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ వుంది గనక జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ వుంటుందని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఎపిలో బిసి నేతలు కూడా ఆ సందర్భాన్నే చూపిస్తున్నారు. కాగా తెలంగాణలో మరో విధమైన వ్యూహం కెసిఆర్ అనుసరిస్తున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా బిసి ప్రజా ప్రతినిధులను కలసి వారిని వ్యక్తిగతంగా సంతృప్తి పరచడం పనిగా పెట్టుకున్నారు.వారిచ్చిన జాబితాపై బహుశా తర్వాత సానుకూల నిర్ణయం ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఆయనే ఏర్పాటు చేసిన ఎంబిసి విభాగం లేకపోవడం గమనార్హమైంది.