అభివృద్ది సాధన కోసం పరస్పరం సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఘనంగా చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి రాజోలిబండకు కృష్ణాజలాలు తెలంగాణాకు సమస్యాత్మకం కాబట్టి స్వయంగా చెప్పిన హితోక్తులను మూలనపడేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నిందలు మొదలు పెట్టారు.
సాగునీటి వివాదాల్లో రెండే పార్టీలు వుంటాయి. ఎగువ ప్రాంతాల వారు లేదా లబ్ది పొందే ప్రాంతాల వారు ఒక వైపు, దిగువప్రాంతాల వారు లేదా నష్టపోయేవారు మరొకవైపు నిలుస్తారు. లబ్దిదారులే సామరస్యం గురించి, మిగులు జలాల గురించి నీతిబోధనలు సామరస్య వాక్యాలు హిత వచనాలు చెబుతూంటారు. విషయం తెలియని ఇతరప్రాంతాల వారు నీతిబోధనల వైపే మొగ్గు చూపుతారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణా అనుసరిస్తున్న వైఖరినే తెలంగాణా పట్ల కర్నాటక పాటిస్తోందని కెసిఆర్, ఆరాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మరచిపోవడమో, మరచిపోయినట్టు నటించడమో జరుగుతోంది.
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచితే దిగువవున్న తమకు నీళ్ళు రావని అవిభక్త ఆంధ్రప్రదేశ్ గతంలోనే ఫిర్యాదు చేసింది. ఆతగాదా తీరకమునుపే రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆర్ధిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ అవస్ధలు పడుతూండగా కడుపు నిండిన తెలంగాణా పాలకులు ఎపి పాలకులతో తగాదాలుగా, హితవచనాలుగా కాలం గడిపేస్తూండగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంచుకోడానికి కృష్ణా ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ ప్రకారం కర్నాటక రాష్ట్రం ఆప్రాజెక్టు ఎత్తు పెంచేస్తే కృష్ణా జలాలలో 130 టిఎంసిలు అదనంగా కర్నాటకకు మళ్ళిపోతాయి. ఇందువల్ల ప్రత్యక్షంగా తెలంగాణా, ఎపిలలో కృష్ణానదిమీదున్న ప్రాజెక్టులకు నీరందదు. అంతకుమించి ఈ రెండు రాష్ట్రాలలో కృష్ణానది పరివాహకప్రాంతంలో భూగర్భజలవనరుల మట్టం పడిపోతుంది..ఇదే పెద్దనష్టం.
”పెద్దమనసుతో” ఎపికి మంచిమాటలు చెబుతున్న కెసిఆర్ తనరాష్ట్రానికి, దిగువ వున్న ఎపికి – ఎగువవున్న కర్నాటక నుంచి తరుముకొస్తున్న ముప్పును గుర్తించాలి…ట్రిబ్యునల్ తీర్పు పై అపీలు చేసి, ఎత్తు పెంపుదలను ఆపించి వేయడానికి దిగువ రాష్ట్రాలు నష్టపోకుండా చూడటానికి శక్తిసామర్ధ్యాలు ప్రయోగించాలి.
అలాకాకుండా విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 పరిధిలో వున్న ఉమ్మడి ఆస్తుల పంపకాల గురించి కన్వీనియంట్ గా పక్కనపెట్టేసి కేవలం కృష్ణాజలాలగురించో, హైకోర్టు విభజన గురించో మాత్రమే కెసిఆర్ మాట్లాడుతున్నారు. ఈ ఆయనలో చిత్తశుద్ధి గాక ఒక ప్రాంతం ప్రజల మనోభావాలను మరో ప్రాంతం మీదికి సెంటిమెంటల్ గా ఎగదోసి రోజులు గడుపుకునే మాయ గా మాత్రమే అర్ధమౌతూంది.
కర్నాటక ప్రయత్నాల్ని అడ్డుకోకపోతే తెలంగాణా నష్టపోతుంది. ఆదిగువ వున్న ఎపి కి కూడా నష్టం తప్పదు…అయితే కాస్తకష్టమైనా,ఎంతో వ్యయప్రయాసలతోనైనా కృష్ణలోకి మళ్ళించకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి వుంది. గోదావరి కూడా తెలంగాణా మీదుగా ఎపిలోకి ప్రవేశిస్తూంది. అయితే ప్రాజెక్టుల నిర్మాణానికి కష్ణానది మీద వున్న అనుకూలత గోదావరి మీదలేదు!
ఇవన్నీ దృష్టిలో వుంచకుని కెసిఆర్, ఆయన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఎపి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం మానేసి కర్నాటకమీద ఫోకస్ పెడితే మంచిది!