సవాళ్ళను అధిగమించి ప్రతికూలతలను సైతం అనుకూలతలుగా మార్చుకునే కేసీఆర్.. అధికారం కోల్పోయాక ఆ చాణక్యాన్ని ప్రదర్శించడం లేదు. పైగా అధికార కాంగ్రెస్ ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న అస్త్రం.. రైతు రాజకీయం. ఇది భూమ్ రాంగ్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పొలాల బాట పట్టిన కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ హామీ మేరకు 2లక్షల రుణమాఫీ చేయాలని.. 5వందల బోనస్ ప్రకటించాలని.. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు కేసీఆర్ వైఫల్యాలను గుర్తు చేయడమేనని రాజకీయ పరిశీలకులు అభిపాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని 2018లో హామీ ఇచ్చిన కేసీఆర్…నాలుగేళ్ల తర్వాత ఎన్నికల ముంగిట ఆ హామీని నెరవేర్చారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలో 2లక్షల రుణమాఫీ జరిగిపోవాలని డిమాండ్ చేయడం టూమచ్ అనిపిస్తోంది. పంటకు మద్దతు ధర కోసం పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన సంఘటనలు బీఆర్ఎస్ హాయాంలో ప్రతి ఏటా కనిపించాయి. రుణమాఫీపై కాలయాపనతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఏనాడూ స్పందించలేదన్న అసంతృప్తి రైతాంగంలో ఉంది.
అధికారం కోల్పోయేసరికి లోక్ సభ ఎన్నికల ముంగిట రైతుల ప్రాపకం కోసం పొలాల బాట పడుతున్నారన్న అపవాదును కేసీఆర్ సొంతం చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ లను వదిలిరాని కేసీఆర్.. ఇప్పుడు ఏమొహం పెట్టుకొని బయటకు వస్తున్నారన్న కాంగ్రెస్ నేతల కౌంటర్లకు బీఆర్ఎస్ నేతలు సైతం నీళ్లు నములుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. ఏం చేసినా ఆ పార్టీని వేలెత్తి చూపేలా ఉన్నాయి. కేసీఆర్ తనకు పదేళ్ల కాలంలో వెన్నుదన్నుగా నిలబడిన రైతుల సహాయంతో రాజకీయం చేయాలని చూస్తున్న అవన్నీ పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.