తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ పార్టీ నేతలు సంబరంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేసీఆర్ తొలి పుట్టిన రోజు అంతే కాదు… ఎన్నికల ఏడాదిలో పుట్టిన రోజు కావడతో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ నగరం మొత్తం ఫ్లెక్సీలతో హోరెత్తించారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ వంటి నినాదాలతో ఎటుచూసినా హోర్డింగ్లు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోజంతా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ పక్కన రోజంతా భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు. సంక్షేమ పథకాలపై జబర్ధస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం. భారీ కేక్ కటింగ్, భోజన ఏర్పాట్లు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ లాంటివి ఏర్పాటు చేశారు. అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిజానికి కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించి… పరేడ్ గ్రౌండ్లో బహిరంగసభ నిర్వహించాలనుకుంటున్నారు. కానీ ఎన్నికల కారణణంగా వాయిదా వేశారు. అయితే సచివాలయ ప్రారంభోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించాలని.. ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఏర్పాట్లను సీఎం పుట్టిన రోజు వేడుకలకు ఉపయోగించనున్నారు.
దేశ్ కీ నేత అనే ట్యాగ్ లైన్ ను బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. పదిహేడో తేదీన దేశవ్యాప్తంగా ఈ ప్రచారం జరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడంతో పాటు పత్రికలు టీవీ చానళ్లలో ప్రకటనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రధాని సహా ఏ రాజకీయ నేత పుట్టిన రోజుకు జరగని విధంగా కేసీఆర్ పుట్టిన రోజు హంగామా చేయాలని బీఆర్ఎస్ నేతలు పట్టుదలగా ఉన్నారు.