హైదరాబాద్: కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిన్న తెలంగాణ అంతటా అనేక చోట్ల ఘనంగా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే విలక్షణంగా ఆంధ్రా ప్రాంతంలో… అందునా కోనసీమ ప్రాంతంలో ఒక వీరాభిమాని కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ అభిమాని పేరు సంగినీడి సీతారామ్. ఈయన తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన సెటిలర్. తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక అనే సంస్థను స్థాపించి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారట. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిన్న అమలాపురంలో ఈయన హడావుడి చేశారు. పట్టణంలో కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు పెట్టటమే కాకుండా ఒక అంధుల పాఠశాలలో కేక్ కట్ చేసి అక్కడి విద్యార్థులకు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయటంద్వారా ప్రజల మన్నన పొందుతున్నారన్నారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని ఆశ్చర్యంగా చూశారు.