తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే.. తీవ్రంగా నష్టపోయింది. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరదలపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్ర పాలకులు.. వరద నియంత్రణ ప్రణాళికలను ఆంధ్రకే పరిమితం చేసి తెలంగాణను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎంత బీభత్సం సృష్టించినా… ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదని కేసీఆర్ అంటున్నారు. అందుకే ఇప్పుడు ” ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ” పాలసీని రూపొందించాలని నిర్ణయించారు.
వరంగల్ జిల్లాలో ఈ సారి అనూహ్యమైన వరద వచ్చింది. చెరువులన్నీ కబ్జా చేసి కాలనీలు నిర్మించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు సామాన్య జనం నుంచి వస్తున్నాయి. అయితే.. కేసీఆర్ మాత్రం… గత పాలకులు.. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో తెలంగాణను పట్టించుకోకపోవడం వల్లే సమస్య వచ్చిందని గుర్తించారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో.. వరద నియంత్రణను పక్కాగా పూర్తి చేయడానికి ఓ పాలసీని రూపొందించబోతున్నారు. . ఏ స్థాయిలో వర్షం వస్తే ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది వంటి అంశాలను అధ్యయనం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
కొత్త ఫ్లడ్ మేనేజ్మెంట్ పాలసీలో.. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడెక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు అన్ని పట్టణాల్లో మున్సిపల్, పోలీసు విభాగాలతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా ప్రణాళికఉండాలన్నారు. నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్షీట్ తయారు చేసి నదులు పొంగినప్పుడు తలెత్తే పరిస్థితులను నమోదు చేయాలన్నారు. కేసీఆర్ ఆలోచనల మేరకు త్వరలోనే ” ఫ్లడ్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ” పాలసీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.