తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క కారు కూడా కొనలేదని చెబుతున్నారని కానీ ఆయన ఏకంగా 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొనాలని అనుకున్నారని చెప్పినా ఆరోపణలు అయ్యేవేమో కానీ.. కొనేశారని.. విజయవాడలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. తాను ముఖ్యమంత్రి అయిన పది రోజల వరకూ తనకు ఈ విషయం తెలియలేదని రేవంత్ చెప్పారు. ఒక్కొక్క కారుకు కనీసం మూడు కోట్లు ఖర్చవుతోందని మూడో సారి గెలవగానే ఆ కొత్త కాన్వాయ్ లో తిరగాలని అనుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర సంపదను ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికే రెండు, మూడు కాన్వాయ్ లు కొన్నారు. వాటికి విజయవాడలో బుల్లెట్ ఫ్రూఫింగ్ ఇతర పనులు చేయించేవారు. ఈ సారి కూడా అక్కడే పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్లు అన్నింటినీ కొనేయడంతో… తెలంగాణ కొత్త మంత్రులకు కార్ల కొరత తీరిందన్న సెటైర్లు వినపిస్తున్నాయి.
కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం.. కొత్త సచివాలయాన్ని నిర్మించడమే కాదు.. కొత్త కాన్వాయ్ ను కూడా సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. ఈ కాన్వాయ్ ను రేవంత్ రెడ్డి వాడతారో లేదో కానీ రేవంత్ బయటపెట్టిన ఈ కార్ల వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది.