బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? జనాలను అట్రాక్ట్ చేయగల కేసీఆర్ స్పీచ్ ఇప్పుడు బీఆర్ఎస్ ను పతనావస్తలోకి నెట్టేస్తోందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ప్రధాని మోడీ జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారనే వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావిస్తూ..ఇది నిజమే అయితే ఈడీ, ఐటీని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. మోడీ – రేవంత్ మిలాఖత్ కాకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని కేసీఆర్ చేసిన డిమాండ్ పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రధాని సహా కేంద్రమంత్రులంతా ఆరోపించారు. స్వయంగా బీజేపీ నేతలే చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినా నాటి బీఆర్ఎస్ సర్కార్ పై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
తాజాగా మోడీ తెలంగాణ పర్యటనలో రేవంత్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించగానే.. కేసీఆర్ స్పందించడం, వెంటనే ఈడీ, ఐటీని రంగంలోకి దించాలని కోరడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హాయాంలో కేసీఆర్ ఫ్యామిలీపై లెక్కలేనన్ని అవినీతి , ఆరోపణలు వచ్చినా వాటన్నింటిని రాజకీయ విమర్శలంటూ కొట్టిపారేసిన కేసీఆర్… రేవంత్ పై మాత్రం మోడీ విమర్శలు చేయగానే వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం ఎబెట్టుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేసీఆర్ ప్రసంగం కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టినట్లుగా లేదని.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ జరిగేందుకు ఆయన తాజా వ్యాఖ్యలు కారణం అవుతున్నాయని విశ్లేషిస్తున్నారు.