చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడుతున్న సమయంలో కేసీఆర్ తాము ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని మీడియాకు లీక్ చేశారు. క్రిస్మస్ తర్వాత బీఆర్ఎస్ కిసాన్ సెల్ విభాగాలను ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి కసరత్తు పూర్తి చేశారు. ఆ ఆరు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు.. పని చేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారని.. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓ ప్రముఖుడ్ని బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్ష పదవికి ఖరారు చేశామని.. క్రిస్మస్ తర్వాత ప్రకటిస్తామని చెబుతున్నారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని కేసీఆర్ నిర్ణయించినందున… అన్ని రాష్ట్రాల్లోనూ రైతు నేతలనే పార్టీ ఫేస్లుగా ముందుగా ప్రచారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ.. ఏపీలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. అక్కడ బీఆర్ఎస్ రాజకీయం ప్రారంభమైనట్లే అనుకోవచ్చు.
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. డిసెంబర్ నెలాఖరున.ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బిఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారని కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.