భారత రాష్ట్ర సమితి వరంగల్ శివారులోని సభ నిర్వహించింది. దాదాపుగా రెండు నెలల పాటు కసరత్తు చేసి కం బ్యాక్ అని ప్రజలకు అనిపించేలా నిర్వహించాలని ప్రయత్నించారు. ప్రజలంతా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారన్న భావన వచ్చేలా చేయాలని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా ఖర్చుకు వెనుకాడకుండా సభా ఏర్పాట్లు చేశారు. కానీ ఫలితం ఎంత అనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో .. మరో సభకు వెళ్లాం.. వచ్చాం అన్న ఫీలింగ్ తోనే తేలిపోతోంది. బహిరంగసభ నిర్వహణకు ఉండాల్సిన ఓ భావోద్వేగం ఈ సారి కనిపించలేదు. బలవంతంగా చేసినట్లుగా అనిపించడంతోనే సభ అంతా కృత్రిమంగా కనిపించిన ఫీలింగ్ వచ్చింది.
బలవంతపు జన సమీకరణ
భారత రాష్ట్ర సమితికి బహిరంగసభల్ని నిర్వహించడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి సభకు జనం రావడం పెద్ద విషయం కాదు. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్‌తో తండోపతండాలుగా జనం వచ్చేవారు. సభలు పెట్టడమే ఆలస్యం. ఆ తర్వాత అధికార పార్టీ హోదా పచ్చింది. ఇక జనం లోటు లేదు. అలా సాగిపోయినా బహిరంగసభల రాజకీయాలకు.. ఇప్పుడు రజతోత్సవ సభగా.. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సభను ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిలోని నేతలకు టార్గెట్ పెట్టారు. వీలైనా వరకూ వారంతా జన సమీకరణ చేయడంతో..జనం పర్వాలేదన్నట్లుగా వచ్చారు.
ఉత్సాహం లేని కార్యకర్తలు
బీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహం అధికారం పోయినప్పుడే పోయింది. ఇప్పుడు మళ్లీ రావాలంటే దానికో రీజన్ ఉండాలి. బీఆర్ఎస్ అధినాయకత్వం వైపు నుంచి అలాంటిదేమీ కనిపించడం లేదు. స్వయంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేటీఆర్, హరీష్ , కవిత మధ్య జరుగుతున్న రాజకీయాలు, ఎవరి వర్గం వారి పోరాటం చూసి క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఎల్కతుర్తి సభ.. బలవంతంగా చేసినట్లుగా ఉంది కానీ..కార్యకర్తల్లో జోష్ మాత్రం కనిపించలేదు.
లక్ష్యం లేని కేసీఆర్ స్పీచ్
అసలు సభ పెట్టింది ఎందుకో అర్థం కాని విధంగా కేసీఆర్ స్పీడ్ సాగింది. ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ప్రసంగం సాగింది. కేసీఆర్ ప్రసంగం అంటే తెలుగు భాషకు పండుగ లాంటిది. ఆయన చెప్పే సామెతలు , ప్రాసలు, ఏక వాక్య పంచులు ఎదుట ఉన్న వారికి ఉత్సాహం తెప్పిస్తాయి. చప్పట్లు కొట్టేలా చేస్తాయి. ఈ సారి కూడా కేసీఆర్ ప్రసంగం ఈ కోణంలో అద్భుతంగా సాగింది. ఇవన్నీ ఆయన ప్రసంగం బోర్ కొట్టకుండా.. నవ్వుకోవడానికి పనికి వచ్చాయి. కానీ అసలు భవిష్యత్ కార్యాచరణ ఏమిటో మాత్రం గట్టిగా చెప్పలేకపోయారు. పార్టీ క్యాడర్ పోరాడేలా.. భవిష్యత్ ఉందనిపించేలా ఆశను రేకెత్తించలేకపోయారు. భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్న భారతీయ జనతా పార్టీని ఆయన పల్లెత్తు మాట అనలేదు. ఒక్క నక్సలైట్ల అంశంలో మాత్రమే విబేధించారు. కాంగ్రెస్ ను మాత్రం టార్గెట్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ శత్రువుగా తేల్చారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడంపైనా ఆయన ఇచ్చే సమాధానం చాలా వింతగా అనిపించి ఉంటుంది అందరికీ.
కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగితే అది బీజేపీకే లాభం !
కేసీఆర్ ప్రసంగం బీఆర్ఎస్ కు ఊపు తెస్తుందా లేదా అంచనా వేయడం కష్టం. ప్రస్తుత రాజకీయంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత అంటూ పెరిగితే అది బీజేపీకే. ప్లస్ అయ్యేలా ఉంది. ఇప్పటి వరకూ అధికారం చేపట్టకపోవడం.. పొటెన్షియల్ నాయకత్వం ఎదుగుతూండటం దీనికి కారణం. ఈ పరిస్థితిని మార్చుకుని..తమ పార్టీకి అనుకూలంగా ప్రజలు మారాలంటే.. బీఆర్ఎస్కు ఇప్పుడు చేస్తున్నది సరిపోదు.