తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్న కేసీఆర్.. ఏపీలోనూ బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అందు కోసం పార్టీ నేతల వేట సాగిస్తున్నారు. గతంలో తనతో పాటు టీడీపీలో పని చేసి.. ఇప్పుడు పెద్దగా అవకాశాల్లేక ఖాళీగా ఉన్న వారికి కేసీఆర్ బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఫోన్లు చేసి తన పార్టీలో చేరాలని యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఉండవల్లిని ఈ విషయంలో టెంప్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఆయన తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో పాలన దారుణంగా ఉందని ఇటీవల టీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే అంటున్నారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్లాన్ ప్రకారమే.. కేసీఆర్ తన భారత రాష్ట్ర సమతిని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీలో అడుగు పెడతామని కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్ కూడా తమను చాలా మంది పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరు పిలుస్తున్నారు.. ఏమిటి అన్నదానిపై క్లారిటీలేదు కానీ.. ఎప్పటికైనా ఏపీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతోనే కేసీఆర్ స్కెచ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఏపీ ప్రజలపై విద్వేషాలు రెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఇప్పటికీ ఏపీకి రావాల్సిన వాటిని న్యాయంగా ఇవ్వడం లేదన్న వాదన ఉంది. అయితే ప్రస్తుతప్రభుత్వం సామరస్యంగా ఉంటోంది. అడగాల్సిన చోట అడగడం లేదు. ఈ పరిణామాలతో ఏపీ నుంచి ఎవరైనా.. కేసీఆర్తో కలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఏపీలో తన పార్టీ ఉనికి మాత్రం బలంగా చాటాలని కేసీఆర్ ప్రయత్నించే అవకాశాలున్నాయి.