మునుగోడు ఉపఎన్నికలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా చక్కబెడుతున్నారు. హుజూరాబాద్‌లో జరిగిన తప్పులు ఇక్కడ జరకుండా చూసుకుంటున్నారు. ఈ సారి అక్కడి బాధ్యతను హరీష్‌కు పూర్తి స్థాయిలో అప్పగించడంలేదు. మంత్రి జగదీష్ రెడ్డే ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. కానీ కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు . మండలాల వారీగా ఇంచార్జుల్ని నియమిస్తున్నారు. అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేశారు. అయితే ఆయనపై తీవ్ర అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది.
ఆర్థిక పరంగా.. సర్వేల్లోనూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సానుకూలత వస్తోందని భావిస్తున్న హైకమాండ్.. అసంతృప్తిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వారు మంత్రి జగదీష్ రెడ్డి మాటలు వినడం లేదు. దీంతో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కొంత మంది నేతల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. కూసుకుంట్లకే మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇక పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వే సమాచారం తెప్పించుకుని.. ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ప్రణళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో కేసీఆర్ ఒక ఎన్నిక మీద ఇలా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం ఇదే మొదటి సారి అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాకలో అతి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ ఒక్క రోజు సమయం కేటాయించినా పరిస్థితి వేరుగా ఉండేదనుకున్నారు. హుజురాబాద్‌లోనూ అంతే. పూర్తిగా హరీష్‌కు బాధ్యతలిచ్చారు. హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహించారు కానీ హుజూరాబాద్ వైపు వెళ్లలేదు. ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. దీంతో పార్టీ వర్గాల్లోనూ విశ్వాసం పెరిగింది.