మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టిన కేసీఆర్ తనదైన శైలిలో కసరత్తు చేస్తున్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో నరాలు తెగే టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. సీఎంగా కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు పూర్తవుతోంది. కానీ.. తమ పరిస్థితి ఏమిటన్నదానిపై .. రకరకాల ఊహాగానాలు వస్తూండటంతో ఆ నేతలంతా టెన్షన్ పడుతున్నారు కానీ.. సమాచారం మాత్రం తెలియడం లేదు. కేసీఆర్ను కలిసి ఓ దరఖాస్తు పెట్టుకుందామని ప్రయత్నాలు చేస్తున్నా.. సాధ్యం కావడం లేదు.
కేసిఆర్ ను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు ఆ అవకాశం దక్కక పోతుండడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. కానీ కేసీఆర్ కొంత మందిని మాత్రం ఎంపిక చేసి మరీ ప్రగతి భవన్కు ఆహ్వానిస్తున్నారు. ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
రెండు, మూడు రోజులుగా… పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులను.. కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపిస్తున్నారు. అందర్నీ కాదు.. కొంత మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే. ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలను రెండు రోజుల కిందట.. ప్రగతి భవన్కు పిలిపించిన కేసీఆర్.. వారితో ఓ పూట అంతా మాట్లాడారు. ఏం మాట్లాడారన్నదానిపై.. మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ ఎన్నిక సమయంలోనూ కేసీఆర్ ఇలానే ఉత్కంఠ కొనసాగించారు. స్పీకర్ గా ఎవరు నామినేషన్ వేస్తారన్న అంశాన్ని… చివరి వరకూ బయటపెట్టలేదు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ విషయంలోనూ.. ఇదే సీన్ కనిపిస్తోంది. కొంతమంది నేతలనే పిలిచి విడివిడిగా ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడుతుండడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. క్యాబినెట్ లోకి తీసుకునేందుకే పిలిచి మాట్లాడుతున్నారని కొంత మంది అంటున్నారు. ఇవ్వడానికి ఎందుకు పిలుస్తారు.. అవకాశం లేదని చెప్పడానికేనని..మరికొంత మంది విశ్లేషిస్తున్నారు.
ఈసారి క్యాబినెట్ లో కొత్త ముఖాలకు చోటివ్వాలని కెసీఆర్ భావిస్తున్నారనేది.. టీఆర్ఎస్ వర్గాలకు బాగా అవగగతమైన విషయం. వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, పువ్వాడ అజయ్, రేఖానాయక్ పేర్లు ప్రగతి భవన్ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అసలు పేర్లు వినిపించని వారినే పిలుస్తూండటంతో.. తమకు పిలుపు రాకూడదని మాజీ మంత్రులు కోరుకుంటున్నారు. కేటిఆర్, హరీశ్ కు కూడా తొలి విస్తరణలో చోటు లేదని క్లారిటీ వచ్చేసిందంటున్నారు. సీనియర్లు, మాజీ మంత్రులకు లోక్సభ ఎన్నికలు బాధ్యతలు ఇవ్వడానికే.. కేసీఆర్ రెడీ అయ్యారు. అందుకే మంత్రి వర్గ కసరత్తు… బుజ్జగింపుల కోసమే జరుగుతోందంటున్నారు.