మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరుకి నిన్ననే తెరపడింది. ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. బాధ్యత అంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చూసుకున్నారు. ఆయన కూడా ప్రచార బాధ్యతలు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే, ప్రచార పర్వం అంతా అయిపోయాక ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచి నాయకులతో ఆయనే స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు స్పందించడం వెనక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, మంత్రి కేటీఆర్ ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. కాబట్టి, ఎన్నికలకు అత్యంత కీలక సమయంలో ఆయన పార్టీ కేడర్ కి అందుబాటులో ఉండలేని పరిస్థితి వచ్చింది. దీంతో కేసీఆర్ స్వయంగా మంత్రులూ ఎమ్మెల్యేలతోపాటు, కొంతమంది అభ్యర్థులకు కూడా ఫోన్లు చేసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు సమాచారం. ఇక రెండో కారణం… నిజామాబాద్ జిల్లాలో స్థానికంగా కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోందనీ, స్థానిక నేతల వల్ల పరిస్థితి చక్కబడలేదని చివరి నిమిషంలో పార్టీకి తెలియడమని అంటున్నారు. దీంతో ఆ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లాకి సీఎం పంపించారు.
నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ఇప్పుడైనా పార్టీ పట్టు నిలుపుకోవాలంటే… ఈ జిల్లాలో విజయం సాధించాల్సి ఉంది. వాస్తవానికి కవిత కూడా తన సొంత నియోజక వర్గంపై పెద్దగా శ్రద్ధ తీసుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతోపాటు, భాజపా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో మరోసారి భాజపా పట్టు సాధించగలిగితే… భవిష్యత్తులో ఆ పార్టీ మరింత బలపడే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి కదా.