తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్ మాత్రమే కాదు.. లీడర్లు కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. బీజేపీతో సఖ్యతగా ఉండాలా.. నేరుగా పోరాడాలా అన్నదానిపై క్లారిటీ లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారా.. కేటీఆర్ పీఠమెక్కుతారా అన్నదానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య టీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు ఎప్పుడూ లేనంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా బీజేపీ నేతలు తమ ఇళ్లపై దాడి చేసినా ఎలా స్పందించాలో తెలియక హైకమాండ్ వైపు చూడాల్సి వస్తోంది. వారి నుంచి వచ్చిన సూచనల మేరకు స్పందించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయన ఆదివారం పూట.. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామని అందరూ ఎట్టి పరిస్థితుల్లో రావాలని సభ్యులందరికీ సమాచారం వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దీనికి అధ్యక్షత వహిస్తారు. కార్యవర్గ సభ్యులకు అందిన సమాచారం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న జరగబోయే వార్షిక మహాసభ వంటి అంశాలపై చర్చించడానికి సమావేశం అని చెప్పారు. కానీ.. అసలు విషయం మాత్రం… పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వడానికేనని చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీతో ఎలా వ్యవహరించాలి… నాయకత్వ మార్పు విషయంలో ఏం చేయాలన్నదానిపై కేసీఆర్ స్పష్టత నిచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ సంధి దశలో ఉంది. ఓ వైపు ప్రజల్లో ఆదరణ పడిపోతోందన్న ప్రచారానికి తోడు ముందు ముందు కొన్ని కఠిన పరీక్షలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు… నాగార్జున సాగర్ ఉపఎన్నిక వంటివాటిని అధిగమిచాల్సి ఉంది. వాటితో తేడా వస్తే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే కేసీఆర్ తనదైన శైలిలోరాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బీజేపీతో సాఫ్ట్ గా వ్యవహరిస్తూండటం వల్ల వస్తున్న విమర్శలను చెక్ పెట్టడానికి… ఒక అడుగు వెనక్కి వేశాం కానీ… ఏ మాత్రం తగ్గేదిలేదని తేల్చడానికి ఈ కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.
నాయకత్వ మార్పు విషయంలో మొదట్లో చాలా మంది ప్రకటనలు చేశారు. వారందరూ.. హైకమాండ్ సూచనల మేరకే చేశారన్న ప్రచారం జరిగింది. ఇటీవలి కాలంలో పెద్దగాఎవరూ స్పందించడం లేదు. అసలు నాయకత్వ మార్పు ఉంటుందా లేదా.. ఉంటే ఎప్పుడు ఉంటుందన్నదానిపై… కూడా ఆదివారం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు.